ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ డబ్బులు పెట్టిన నిర్మాతలకి మాత్రం నిద్ర కూడా పట్టే అవకాశం లేదు. ఇక స్టార్ హీరోతో చేస్తున్న సినిమా అయితే ఆ నిర్మాతలకి చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది మైత్రి మూవీ మేకర్స్. ఒక స్టార్ హీరోతో సినిమా చేసి రిలీజ్ చేయాలంటేనే కష్టం, అలాంటిది ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలని ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి అంటే ఇంకేలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం మాస్ డెమీ గాడ్స్ అయిన బాలయ్య, చిరులతో ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికే విడుదల అవుతుండడంతో, ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోల మధ్య ఇగో ఇష్యూ రాకుండా, అభిమానులకి తమ హీరో సినిమాకి అన్యాయం జరుగుతోంది అనే ఫీలింగ్ తీసుకోని రాకుండా మైత్రి మూవీ మేకర్స్ చాలా జాగ్రతగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఒకసారి చిరు సినిమా నుంచి అప్డేట్ వస్తే, ఆ తర్వాత రోజే బాలయ్య సినిమాకి సంబంధించిన అప్డేట్ ని రిలీజ్ చేస్తున్నారు. పోస్టర్స్ నుంచి సాంగ్స్ వరకూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్న మైత్రి మూవీ మేకర్స్, రెండు సినిమాలకి ఈక్వల్ బజ్ ని మైంటైన్ చేయడంలో సక్సస్ అవుతున్నారు. ప్రమోషన్స్ వరకూ బాగానే ఉంది కానీ రిలీజ్ డేట్ టైంకి ఏ సినిమాకి ఏ సెంటర్ లో ఎన్నో థియేటర్స్ దొరుకుతాయి అనేది చూడాల్సి ఉంది. రిలీజ్ డేట్ విషయంలో కూడా మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ బయటకి రాలేదు. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాల మధ్యలో దిల్ రాజు తన ‘వారిసు’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలానే ఆలోచనలో ఉన్నాడు. విజయ్ నటిస్తున్న వారిసు సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. మరి చిరు, బాలయ్య, విజయ్ సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుంది? ఏది ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనేది చూడాలి.