సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘ అన్నీ మంచి శకునములే’. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతున్న సందర్భంగా సంతోష్ శోభన్ విలేకరులతో తన కెరీర్ గురించి ముచ్చటించాడు. తొలుత మూవీ గురించి చెబుతూ ”నాకు అడ్వాన్స్ చెక్ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్ గారే. ‘పేపర్‌బాయ్’ చిత్రం తర్వాత 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్ లో వచ్చింది అనుకున్నాను. నందినిరెడ్డి గారు స్వప్న గారు నన్ను ఆడిషన్ లో ఎంపిక చేశారు. ఆరోజు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నేను వారిని కలవడం అనేది చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఈ సినిమాలో నేను, షావుకారు జానకీ గారు డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఇలాంటి పాత్ర చేసే అవకాశం యూత్ లో నాకే వచ్చింది అనుకుంటున్నాను. తను చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. సీనియర్ గా ఆమె నటనానుభవాలను షేర్ చేసుకున్నారు. ఇక అక్కంటే మా వాసుకి లా ఉండాలి అనిపించింది. ఆమె సూపర్. ‘తొలిప్రేమ’ సినిమా చూశాక వాసుకి లాంటి చెల్లెలు వుంటే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమాలో అక్కంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. ఎమోషన్స్, లైటర్ వే లో సీన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆమెతో ఇంకా కలిసి సినిమాలు చేయాలనిపించింది” అని చెప్పారు.
నందినీ రెడ్డి గురించి చెబుతూ, ”నందినిరెడ్డి గారితో పనిచేయడం ఎట్రాక్ట్ చేసింది. ”ఖుషి, తొలిప్రేమ” సినిమాలు చూశాక పవన్ కళ్యాణ్ గారి నటన బోనిఫైడ్ రొంమ్ కామ్ లా అనిపిస్తుంది. అలాగే నాకూ నందినిరెడ్డి గారి ‘అలా మొదలైంది’ చూశాక అనిపించింది. అప్పటినుండి ఆమెతో సినిమా చేయాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో చాలా మ్యాజిక్ జరిగింది. నాకు అవకాశం రావడం అదృష్టమే. నా కెరీర్ లో ఇలాంటి కథకానీ, ఇంతమంది నటీనటుల కాంబినేషన్ లో భాగమయ్యే అవకాశం రాదేమోనని అనుకుంటున్నా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ కథ, వెండితెరపై చూడాల్సిన సినిమా ఇది. ఆ ఫీలింగ్ సినిమా చేసేటప్పుడు అనిపించింది. ఈ సినిమా టైటిల్ వినగానే చాలా నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. ఇటీవలే ఈ సినిమాను ఎటవంటి బీజియమ్ లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది. అదే శుభ శకునం నాకు” అని అన్నారు.
నిర్మాణ సంస్థ గురించి చెబుతూ, ”అశ్వనీదత్‌గారి 50 ఏళ్ళ కెరీర్ బేనర్ లో నేను చేయడం చాలా ఆనందంగా వుంది. నాన్నగారు అప్పట్లో వారి బేనర్ లో ఓ సినిమా చేశారు. నేను కూడా వారి బేనర్ లో చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్ లో పనిచేయడం లక్క్ గా ఫీలవుతున్నాను” అని అన్నారు. మదర్స్ డే సందర్భంగా ఆమ్మ తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ , ”మొన్న ఓ టీవీ షోలో కూడా అమ్మగారి గురించి అడిగారు. మాటలు రాలేదు. నటుడిగా సినిమాలు చేయడం ఆమెకు చాలా హ్యాపీగా వుంది. మొదట్లో నటుడిగా చాలా కాలం గేప్ తర్వాత కూడా అమ్మ ఇచ్చిన ధైర్యం మర్చిపోలేనిది. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడం చెప్పలేని ఆనందం. అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేయగలుగుతున్నాను” అని అన్నారు.