డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలోని ప్రతిభను బయటపెట్టారు. ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ప్రభుదేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు ఎన్. రాఘవన్.
అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకు మించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా ఇదే నెల 15వ తేదీ జనం ముందుకు రాబోతోంది. ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటించగా, రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించారు. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. డి. ఇమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.