నటుడు మురళీ మోహన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో కొత్త కుర్రాడిగా పరిచయమై ఆనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మురళీ మోహన్. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ఎన్నో మంచి సినిమాలను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరో కృష్ణతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఒకానొక సమయంలో కృష్ణ ఫ్యాన్స్ ఆయనను కొట్టడానికి కూడా వచ్చారని చెప్పి షాక్ ఇచ్చారు.
” కృష్ణ గారు, నేను ఇంటర్ లో క్లాస్ మేట్స్.. కాలేజ్ మొత్తం కి కృష్ణ గారే అందగాడు.. అందరు ఆయన చుట్టూనే తిరిగేవారు.. కాలేజ్ తరువాత తేనే మనసులు సినిమాతో ఆయన హీరోగా మారడం.. ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఎదగడం అందరికి తెలిసిందే. ఇక నేను నటన వైపు నుంచి నిర్మాతగా మారాక.. కృష్ణ, నాగార్జున కాంబోలో వారసుడు చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమాలో నాగార్జున, తండ్రి కృష్ణను నిలదీసే సీన్ ఒకటి ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ తారా స్థాయికి వెళ్లే సీన్.. ఇందులో కృష్ణ, నాగార్జున నువ్వెంత అంటే నువ్వెంత అనేవరకు వస్తారు.
ఇక ఆ సీన్ చూసిన కృష్ణ అభిమానులు మా ఇంటి మీదకు గొడవకు వచ్చారు. కొంతమంది అయితే నన్ను కొట్టడానికి కూడా వచ్చారు. కృష్ణగారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడు? అలా అనడానికి వీల్లేదు.. ఆ యాసీన్స్ ని కట్ చేయండి.. లేకపోతె సీన్ మార్చండి అంటూ మా ఇంటిముందు అరుస్తూ గొడవకు దిగారు. అయితే అది సినిమా.. కథను, పాత్రను బట్టి చూడండి.. పర్సనల్ గా తీసుకోవద్దు అని నేను నచ్చచెప్పినా వినలేదు.. కృష్ణ గారిపై అంత అభిమానం వారికి.. ఇక కృష్ణ గారి గురించి చెప్పుకోవడం కాదు కానీ.. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నిర్మాతల హీరో.. ఒక నిర్మాత ప్లాప్ లో డబ్బులు పోగొట్టుకుంటే.. ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి .. కొత్త సినిమా తాను చేస్తానని చెప్పఁవాడు. నిర్మాత డబ్బులు లేవని చెప్పినా అవన్నీ తరువాత మీరు సినిమా మొదలు పెట్టండి అని భరోసా ఇచ్చేవాడు.. అలాంటి గొప్ప మనిషిని నేను ఇంతవరకు చూడాలేదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.