నటుడు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేసి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు వయోభారం రీత్యా ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. అడపాదడపా సినిమా ఫంక్షన్స్‌లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో జరిగిన ప్రెస్ మీట్‌కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘అతడు’ సినిమా తర్వాత తాము జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద సినీ నిర్మాణానికి బ్రేక్ ఇచ్చామని, త్వరలో మళ్లీ సినీ నిర్మాణం మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
Also Read:Chitrapuri Colony: సినీ డిస్ట్రిబ్యూటర్లు, జర్నలిస్ట్ లకు చిత్రపురి ఫ్లాట్లు?
అలాగే, తన సోదరుడి కుమార్తె ప్రియాంక నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, తాము సినీ నిర్మాణం ఆపేసిన అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, నిర్మాణంలో కూడా ఎన్నో మార్పులు, చేర్పులు వచ్చాయని వెల్లడించారు. అయితే, ఇప్పుడు చేస్తే ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది అని అడిగితే, దానికి ఆయన స్పందిస్తూ, ఇటీవల నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్లు’ అనే సినిమా చూశానని, ఆ సినిమా చూసిన తర్వాత కొత్త వాళ్లు అయినా బాగా చేశారని అనిపించిందని అన్నారు. ఇక మీదట తాను చేయాలనుకుంటే అలాంటి సినిమాలు చేస్తానని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు.