భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో తొమ్మిదవ చిత్రం ‘ఎఫ్ 9’ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ వేసవిలో సినిమా తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఇంతకుముందు ఉన్న నటీనటులే నటిస్తున్నారు. అయితే విలన్ గా మాత్రం ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈసారి స్పేస్ లో ఉండనున్నాయి అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో నిజంగానే స్పేస్ లో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అనే హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్ర దర్శకుడు జస్టిన్ లిన్ ఈ చిత్రంలో అంతరిక్షంలో యాక్షన్ సీక్వెన్స్ ఉందని ధృవీకరించారు. కానీ దాని గురించి చాలా వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. “నేను పరిశోధన కోసం రాకెట్ శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు తిరిగి స్కూల్ కు వెళ్ళినట్లు అనిపించింది. ఇది నిజంగా అద్భుతం” అంటూ చెప్పుకొచ్చారాయన. మీరు కూడా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9’ ట్రైలర్ ను వీక్షించండి.