సుజిత్ రెడ్డి, తరుణి సంగ్ జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’చేరువైన… దూరమైన’. ఈ మూవీకి సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. ఆదివారం జరిగిన మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరై, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కమెడియన్ శ్రీనివాసరెడ్డి నాకు ఎంతో ఆప్తమిత్రుడు. ఇండస్ట్రీలో నాకున్న అత్యంత సన్నిహితుల్లోఆయన ఒకరు. నా స్ట్రగుల్స్ లో తోడుగా వున్నారు. నా స్టోరీస్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడు. 2008 నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం. అందుకే ఆయన మేనల్లుడి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చాను. సుజిత్ కి మంచి భవిష్యత్ వుంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. తప్పకుండా ఈ చిత్రం హిట్ అవుతుంది” అని అన్నారు.
దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ… ”అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడం సంతోషంగా వుంది. ఓ ఏడాది నుంచి ఈ చిత్రం థియేటర్ కి దూరమవుతూ వచ్చింది. చివరకు ఈ ఆగస్టు 20కి చేరువవుతోంది. థియేటర్లో నా సినిమాను చూడటం నా కల. అది నెరవేరబోతోంది. అలాగే హీరో సుజిత్ కు కూడా థియేటర్లో విడుదల కావడం ఎంతో ముఖ్యం” అని అన్నారు.
నిర్మాత కంచర్ల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ”వైజాగ్, కాకినాడ, భీమిలి, హైదరాబాద్ లో షూటింగ్ చేశాం. దర్శకుడు చంద్రశేఖర్ తాను చెప్పిన కథ ఏదైతే వుందో దానినే తీశారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఇష్టపడతారు. నేను ఇదే టీమ్ తో మరో సినిమాను కూడా నిర్మిస్తాను. శ్రీనివాసరెడ్డి అన్న మా వెన్నంటి వుండి ఈ సినిమాను ఎంతో ప్రోత్సహించారు” అని చెప్పారు.
హీరో సుజిత్ మాట్లాడుతూ ‘గత ఎనిమిదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నా. ఏనాడూ నా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఎంతగానో ప్రోత్సహించారు. ఈ రోజు ఈ సినిమా కంప్లీట్ చేయడం వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనే అనుకుంటున్నా. కొత్త హీరో నైనా కూడా నిర్మాతలు నన్ను నమ్మి కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాను తీశారు. వారికి ఎంతో రుణపడి వుంటాను. నేను కమెడియన్ శ్రీనివాసరెడ్డి మేనల్లుడినని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఎందుకుంటే… తను నన్ను సొంతంగా ఎదగాలని చెప్పారు. అందులో భాగంగానే ఎప్పుడూ రివీల్ చేయలేదు. ఈ రోజు గర్వంగా ఆయన మేనల్లుడిని అని చెబుతున్నాను” అని అన్నారు.