శనివారం వీకెండ్ కావడంతో మూవీ లవర్స్ తో థియేటర్ల వద్ద సందడిగా కనిపించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు అందుబాటులోకి వస్తున్నప్పటికి బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని మూవీ ఆడియన్స్ చెప్తున్నారు. పెద్ద సినిమాలు లేకపోయినను.. ఆడుతున్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ రెండు వారాల్లో 8.30 కోట్ల షేర్ ను రాబట్టిందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం – ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ బాగున్నాయి. ఇక ఈ వారంలో వచ్చిన ‘రాజ రాజ చోర’ సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అలరిస్తుండటంతో వీకెండ్ లో సందడి కనిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాలు థియేటర్లకు భయపడుతున్న వేళ చిన్న సినిమాలు కలెక్షన్స్ తో ఆదర్శంగా నిలవటం విశేషం.