ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ. ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ రావడం వల్ల.. అతని తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టుగానే తీర్చిదిద్దేందుకు దర్శకులు చాలా కసరత్తులే చేస్తున్నారు. కథ పరంగానే కాదు, నటీనటుల్ని కూడా ఏరికోరి మరీ తీసుకుంటున్నారు. ఆయా భాషా పరిశ్రమల్లో పేరుగాంచిన వారిని రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా NTR31 ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త తెరమీదకి వచ్చింది.
కొరటాల శివతో NTR30 చేస్తోన్న తారక్.. ఆ తర్వాత తన 31వ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే! అవును, ఇది సెట్స్ మీదకి వెళ్లడానికి ఇంకా చాలా సమయమే ఉంది. అయినప్పటికీ, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఇందులో ఓ కీలక పాత్ర కోసం మోహన్‌లాల్‌ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట! నిజానికి.. మొదట్లో ఈ పాత్ర కోసం లోకనాయకుడు కమల్ హాసన్‌ని సంప్రదించినట్టు ఓ ప్రచారం జరిగింది. ఇప్పుడు మోహన్ లాల్ పేరు తెరమీదకి వచ్చింది.
ఇప్పటికే మోహన్‌లాల్‌ను సంప్రదించడం, కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే.. ‘జనతా గ్యారేజ్’ తర్వాత రెండోసారి తారక్, మోహన్‌లాల్ వెండితెర పంచుకోనున్నారు. మరి, ఈ కాంబో రిపీట్ అవుతుందో లేదో చూడాలి. మరోవైపు.. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ని రంగంలోకి దింపనున్నారని మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్తపై కూడా అధికార స్పష్టత రావాల్సి ఉంది.