Vinaro Bhagyamu Vishnu Kadha: నాగశౌర్య హీరోగా నటించిన ‘నర్తనశాల’ మూవీతో ఉత్తరాది భామ కశ్మీరా పర్దేశీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో తెలుగులో మళ్ళీ అవకాశాలు దక్కలేదు. అయితే చిత్రంగా కాశ్మీరా మరాఠీ, హిందీ, తమిళ, కన్నడ చిత్రాలలో అవకాశాలు అంది పుచ్చుకుంది. మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత ఆమెకు తెలుగులో ఛాన్స్ వచ్చింది. అది ఒక్క సినిమాలో కాదు… రెండు సినిమాల్లో. ఈ రెండు సినిమాలూ కూడా బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కావడం విశేషం. ఫిబ్రవరి 10వ తేదీ కశ్మీరా పర్దేశీ నటించిన ‘వసంత కోకిల’ మూవీ విడుదలైంది. రజనీ తాళ్ళూరి, రేష్మి సింహా నిర్మించిన ఈ సినిమా తెలుగులోనే కాదు… తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదలైంది. బాబీ సింహా హీరోగా రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహించిన ‘వసంత కోకిల’ పరాజయం పాలైంది. అయితే చిత్రంగా… ఆ తర్వాత వారమే వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ హిట్ టాక్ ను తెచ్చుకుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. జీఏ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇందులో యూ ట్యూబర్ గా కశ్మీరా పర్దేశీకి ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. నంబర్ నైబర్ కాన్సెప్ట్ ను కూడా ఆమె మీదనే చిత్రీకరించడంతో ఆ పాత్ర మూవీలో సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో కశ్మీరా కు మరిన్ని తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చే ఆస్కారం ఏర్పడింది.