పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పటి నుంచి రోజురోజుకు ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉందని తలసాని వ్యాఖ్యానించారు. పవన్ వయసు పెరుగుతుందా లేదా తగ్గుతుందో తెలియకుండా ఉందని తలసాని అన్నారు. మూవీ ఇండస్ట్రీ బాగుండాలన్నదే తమ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు.
భారతదేశంలోనే మూవీ ఇండస్ట్రీకి హైదరాబాద్ సినిమా హబ్‌గా ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని.. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. టిక్కెట్ రేట్లు, ఐదో షో.. ఇలా అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతకు మరిన్ని డబ్బులు తెచ్చిపెట్టాలని తలసాని ఆకాంక్షించారు. ఈ మూవీ డైరెక్టర్ సాగర్, రచయిత త్రివిక్రమ్‌కు అభినందనలు తెలుపుతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటంటే.. మారుమూల ఉన్న కళాకారుడిని కూడా లైమ్‌లైట్‌లోకి తీసుకొస్తారని కొనియాడారు.