సాధారణంగా సినిమా హక్కులకి సంబంధించి ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, ఆ డీల్ అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. రోజుల తరబడి చర్చలు జరిపిన తర్వాత, మేకర్స్‌ని సంతృప్తి పరిచే ఫిగర్ వచ్చినప్పుడు, డీల్ ఫైనల్ చేసేస్తారు. కానీ, విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా విషయంలో మాత్రం ఒకే డీల్ రెండుసార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇలా జరగడం చాలా అరుదు. ఆ వివరాల్లోకి వెళ్తే..
రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్సీ రేటుకే సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ఓటీటీ సంస్థ మరో బంపరాఫర్‌తో మేకర్స్ ముందుకొచ్చింది. రిలీజైన మూడు వారాల తర్వాత తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాని స్ట్రీమ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, అందుకు కావాలంటే రెట్టింపు అమౌంట్ ఇస్తామని చెప్పిందట! ఈ రీ-డీల్ వల్ల నిర్మాత ఖాతాలోకి భారీ లాభాలు వచ్చిపడడం ఖాయం.
ఆ ఓటీటీ సంస్థ ఇలా డబుల్ ఆఫర్‌తో ముందుకు రావడానికి ఓ కారణం ఉంది. వచ్చే శుక్రవారం ‘సర్కారు వారి పాట’ భారీఎత్తున విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఆడియన్స్ దృష్టంతా దాదాపు ఆ సినిమా మీదే ఉంటుంది. ఫలితంగా, విశ్వక్ సేన్ సినిమాకు థియేటర్ల కౌంట్ తగ్గిపోవడం, తద్వారా వసూళ్ళు పడిపోవడం ఖాయం. బహుశా సర్కారు వారి పాట వచ్చాక విశ్వక్ సినిమా హవా పూర్తిగా తగ్గిపోవచ్చు.
అప్పుడు థియేటర్ల వద్ద ప్రేక్షకుల హంగామా అంతగా ఉండదు, కలెక్షన్లు కూడా అరకొరనే నమోదవుతాయి. అందుకే, మూడు వారాల్లోనే స్ట్రీమ్ చేసే అనుమతి ఇవ్వాలని, అందుకు రెట్టింపు ధర ఇవ్వడానికి సిద్ధమైపోయింది. సినిమాకి ఎలాగూ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి, త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తే భారీ వ్యూవర్షిప్ వస్తుందన్నది ఆ ఓటీటీ సంస్థ ఉద్దేశం.