Meter: మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సినిమా ‘మీటర్’. రమేష్ కడూరి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిరంజీవి (చెర్రీ), హేమలత దీనిని నిర్మించారు. అతుల్య రవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 7వ తేదీ విడుదల అవుతోంది. ఆ సందర్భంగా చెర్రీ మూవీ విశేషాలను మీడియాకు తెలిపారు. తొలి నుండి ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యమిచ్చే చెర్రీ ‘మీటర్’ గురించి మాట్లాడుతూ, “గతంలో గోపీచంద్ గారితో ‘ఒక్కడున్నాడు’ చేశాం. అది ప్రయోగాత్మక చిత్రం. “మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే” చిత్రాలు కూడా ప్రయోగాత్మక చిత్రాలే. అయితే తొలిసారి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఫార్మెట్ లోకి వెళితే బావుటుందని ‘మీటర్’ తీశాం. కమర్షియల్ ఎంటర్ టైనర్ అంటే సాంగ్స్, ఫైట్స్, కామెడీ అన్నీ ఉన్నప్పటికీ బలమైన కథ వుండాలి. అలాంటి బలమైన కథ ‘మీటర్’ కి కుదిరింది. రమేష్ చాలా మంచి కథతో వచ్చాడు. కంటెంట్ పరంగా ‘మీటర్’ చాలా స్ట్రాంగ్ వుంటుంది. మంచి కథని ప్రయోగాత్మకంగా చెప్పొచ్చు, కమర్షియల్ గా కూడా ప్రజంట్ చేయొచ్చు. మా దర్శకుడు రమేష్.. బాబీ, గోపీచంద్ మలినేని దగ్గర పని చేశాడు కాబట్టి ఆ పంథాలోనే మూవీని తీశాడు. నిజానికి ఈ సినిమాను పెద్ద హీరోతో చేయాలని అనుకున్నాం. కొందరికి కథ కూడా చెప్పాం. అయితే డేట్స్ సెట్ కాకపోవడం, అదే సమయంలో కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ విడుదల కావడంతో అతనికి ఇది సెట్ అవుతుందని పించింది. అతనికీ కథ నచ్చడంలో ఈ ప్రాజెక్ట్ అలా మొదలైంది” అని చెప్పారు.
‘మీటర్’ బడ్జెట్ దాటిందనే విషయం గురించి వివరణ ఇస్తూ, “ఏదైనా సబ్జెక్ట్ బట్టే బడ్జెట్ వుంటుంది. ఉదాహరణకు ‘చమ్మక్ చమ్మక్ పోరి’ పాట వుంది. అది మామూలుగా కూడా తీయొచ్చు. అయితే పాట బాగా వచ్చింది. దాన్ని గ్రాండ్ గా తీయాలని పెద్ద సెట్ వేశాం. మేము ఎప్పుడు ఖర్చుకి వెనకడుగు వేయలేదు. ఎక్కడ అవసరమో అక్కడ పెట్టడానికి రెడీగా వుంటాం. ‘మత్తు వదలరా’ కోటిన్నరలో చేయాల్సిన సినిమా. కానీ రెండున్నర కోట్లు అయ్యింది. “హ్యాపీ బర్త్ డే” ఏడు కోట్లలో తీయాలని అనుకున్నాం. ఎనిమిదిన్నర కోట్లు అయ్యింది. ‘మీటర్’ కూడా మేము అనుకున్న దాని కంటే కొంచెం ఎక్కువైయింది. అవసరంకి తగ్గట్టే ఖర్చు చేశాం. కిరణ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ ఇదే” అని తెలిపారు. తన మూడు దశాబ్దాల కెరీర్ గురించి చెర్రీ చెబుతూ, “నేను 31 ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నాను. “మనీ, మనీమనీ, గులాబీ, రంగీలా” చిత్రాలకు పని చేశాను. తర్వాత “యమదొంగ, ఒకడున్నాడు” చేసి మళ్ళీ నా వ్యాపార అవకాశాలు కోసం వెళ్ళిపోయాను. కాస్తంత గ్యాప్ తర్వాత సినిమాలు చేద్దామని ఇటు వచ్చేసరికి మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చారు. అక్కడ సిఈవో గా జాయిన్ అయ్యాను. అక్కడ చేరినప్పుడే నాకు తగ్గ సినిమాలు చిన్నచిన్నవి చేసుకుంటానని ముందే చెప్పాను. దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తామని అన్నారు. అలా వారితో కలసి పని చేయడం నాకొక అడ్వాంటేజ్” అని వివరణ ఇచ్చారు.
ఓటీటీ కారణంగా థియేటర్లకు జనం రావడం లేదనే విషయం గురించి మాట్లాడుతూ, “శాటిలైట్ వచ్చినపుడు కూడా థియేటర్స్ కి జనం రావడం తగ్గిపోతుందని అన్నారు. ఇప్పుడు ఓటీటీ గురించి కూడా అదే మాట వినిపిస్తోంది. సినిమా అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ పై వుంటుంది. ఇవాళ థియేటర్ కాస్త ఖర్చుతో కూడుకున్నది కావడం వలన కొంత ప్రభావం వుంటుంది. అయితే సినిమా బావుంది అంటే మాత్రం వెళ్తారు. ఇక పెద్ద హీరోల సినిమాలు మాత్రం ఖచ్చితంగా థియేటర్స్ లో చూడటానికే ఇష్టపడతారు. మొన్న సంక్రాంతికి మా “వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య” సినిమాలు విడుదల చేశాం. రెండు పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. రెండిటికీ మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీని అర్ధం.. సినిమా బావుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి చూస్తారు” అని తెలిపారు. దర్శకుడు రితేష్ రానాతోనూ, మరో కొత్త దర్శకుడితోనూ సినిమాలను తీయబోతున్నట్టు చిరంజీవి చెప్పారు.