తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి అవసరం ఉందని తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందించే హీరో ‘చిరంజీవి’. సినిమాలు చెయ్యడంలోనే కాదు సాయం చెయ్యడంలో కూడా ఆయన ముందుంటారు అందుకే చిరంజీవి ‘మెగాస్టార్’ అయ్యాడు. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన పీ.దేవరాజ్ అనే సీనియర్ కెమెరామాన్ కి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇంటి రెంటు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఛాలెంజ్ రాముడు, లాయర్ విశ్వనాథ్, భలే తమ్ముడు, సింహా ఘర్జన లాంటి హిట్ సినిమాలకి డీఓపీగా పని చేసిన దేవరాజ్ అనారోగ్యం నయం అవ్వడానికి డబ్బులు అవసరం ఉందని తెలుసుకున్న చిరంజీవి, దేవరాజ్ ని పిలిపించి అయిదు లక్షల చెక్ ఇచ్చి సాయం చేశాడు. దేవరాజ్, ఆయన కొడుకు కార్తీక్ ని పిలిపించి చిరు స్వయంగా చెక్ ఇచ్చారు. చిరంజీవి నటించిన ‘రాణీ గాజుల రంగమ్మ’, ‘టింగు రంగడు’ లాంటి సినిమాలకి పీ.దేవరాజ్ కెమెరామాన్ గా వర్క్ చేశారు. దేవరాజ్ కి నెలనెలా రజినీకాంత్ అయిదు వేలు, మురళి మోహన్ మందులకి మూడు వేలు పంపిస్తారు.