మెగాస్టార్ తెర మీద కనిపిస్తే… మిగిలిన తారలంతా వెలవెలపోవాల్సిందే! చిరంజీవి కోసమే సినిమా థియేటర్లకు వెళ్ళిన ఆ రోజులను తలుచుకుని మెగాభిమానులు ఇప్పటికీ ఆనందపడుతూ ఉంటారు. ఆయన పక్కన ఎవరు హీరోయిన్, విలన్ అనే దానికి వారు అప్పట్లో ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. చిరంజీవి మేనరిజమ్స్, స్టైలిష్ స్టెప్స్, సూపర్ ఫైటింగ్స్ కోసమే సినిమాలు చూసేవారు. అయితే… ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత మెగాస్టార్ అయినా పక్కన కాస్తంత మాస్ మసాలా దట్టించే హీరోయిన్ ఉండాల్సిందే! అభిమానుల అభిరుచి మారిన విషయం తెలిసే కావచ్చు చిరంజీవి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో కథానాయికలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇప్పుడైతే… టోటల్ మూవీలోని ఆర్టిస్టులందరి మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు. పైగా తన చిత్రాలు ఇతర భాషల్లోకి డబ్ అవుతున్న నేపథ్యంలో ఆట పాటలకు ప్రాధాన్యం ఇస్తూనే, తోటి స్టార్స్ నూ తన పక్కనే పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆ మధ్య వచ్చిన ‘సైరా’లో ఏకంగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి పరభాషా తారలు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వాళ్ళ స్క్రీన్ టైమ్ ఎంత అనే విషయం పక్కన పెడితే, వారు ముగ్గురూ ‘సైరా’లో కీలక పాత్రలనే పోషించారు.
ఇక త్వరలో జనం ముందుకు రాబోతున్న’ఆచార్య’లో అయితే ఏకంగా చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణే నటించాడు. అతనిది అతిథి పాత్రే అని మొదట్లో చెప్పినా… అది ఇంతింతై వటుడింతై అన్న చందాన అలా పెరుగుతూ పోయింది. చెర్రీకి జోడీగా పూజాహెగ్డే నటించడమే కాదు, వాళ్ళ మధ్య పాట కూడా చోటు చేసుకుంది. ఇక సెట్స్ పై ఉన్న చిరంజీవి సినిమాలనూ మల్టీస్టారర్స్ గా మార్చేశారు. మలయాళ చిత్రం ‘లూసీఫర్’ రీమేక్ అయిన ‘గాడ్ ఫాదర్’లో ఏకంగా బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో అతను ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదే సినిమాలో హీరో సత్యదేవ్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న సినిమాలో అయితే రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట! ‘అన్నయ్య’ తర్వాత చిరు చిత్రంలో మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న సినిమా ఇదే! ఇప్పటికీ చిరంజీవిలో సోలోగా థియేటర్ కు జనాలను రప్పించగలిగే స్టామినా ఉన్నా… ‘అంతకు మించి’ అనిపించుకోవాలని ‘అందరివాడు’లా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నాడు. ఇవాళ తెలుగు సినిమా మార్కెట్ బాగా విస్తరించిన నేపథ్యంలో అదనపు స్టార్స్… మెగాస్టార్ సినిమాలో చేయడం కమర్షియల్ గానూ కలిసొచ్చే అంశమే కానీ మరొకటి కాదు! ఏమంటారు!?