Mega Laal Chaddha – King Size Interaction With Chiranjeevi Aamir Khan: తమ సినిమాల ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండే అతికొద్దిమంది కథానాయకుల్లో ఆమిర్ ఖాన్ ఒకడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరొందిన ఈ స్టార్ హీరో.. తన చిత్రాల రిలీజ్‌కి ముందు ఒకట్రెండు ప్రెస్‌మీట్లలో ప్రత్యక్షమవుతాడే తప్ప, ఇతరుల్లాగా కార్యక్రమాలకి వెళ్లడం, ఇంటర్వ్యూలివ్వడం లాంటివి చేయడు. అలాంటి ఆమిర్.. తొలిసారిగా తన ‘లాల్ సింగ్ చడ్డా’ కోసం గ్రాండ్‌గా ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టాడు. వివిధ కార్యక్రమాలకి హాజరవుతుండటమే కాదు, ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగానే.. ‘మెగా లాల్ చడ్డా’ ఇంటర్వ్యూకి శ్రీకారం చుట్టాడు.
కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. ఆమిర్ ఖాన్‌తో ఉన్న సాన్నిహిత్యం కోసం అతని సినిమాని ప్రమోట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. వీరితో పాటు లాల్ సింగ్ చడ్డాలో ఓ కీలక పాత్రలో నటించిన నాగ చైతన్య కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. స్టార్ మాలో త్వరలో ప్రసారం కానున్న ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో నాగ్, చిరు, ఆమిర్ చేసిన సందడి చూస్తుంటే.. ఓ అందమైన అనుభూతి కలగన మానదు. ముగ్గురు లెజెండ్స్‌ని ఒకేసారి ఇలా చూడటం కనులవిందుగా ఉందనే చెప్పాలి. సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల్ని కూడా ఇందులో పంచుకోవడాన్ని మనం గమనించవచ్చు. ప్రోమోనే ఇంత ఆసక్తికరంగా ఉందంటే, పూర్తి ఇంటర్వ్యూ బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయంలా కనిపిస్తోంది.
కాగా.. లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇది హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్! తన గత చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ డిజాస్టర్ అవ్వడంతో.. ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అందుకే, మునుపెన్నడూ లేని విధంగా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోన్న నాగ చైతన్య.. బాలరాజు బోడి అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.