Manchu Vishnu Gives Strong Warning To A Star Hero: మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుకు కోపమొచ్చింది. తన మీద తన కుటుంబం మీద నెగెటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు. మంగళవారం ‘జిన్నా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడాడు. తనను ట్రోల్ చేస్తున్న వారిని కూడా ఈ సమావేశానికి పిలిచానని చెప్పిన ఆయన, జూబ్లీహిల్స్ లోని ఓ హీరోకు చెందిన ఐటీ కంపెనీలోని 21 మంది ఎంప్లాయిస్ అదే పనిగా తన ఫ్యామిలీకి సంబంధించిన ట్రోలింగ్ వీడియోలను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసినట్టు తెలిసిందన్నాడు. వారి ఆఫీస్ చిరునామాతో పాటు, ఐపీ అడ్రస్ లతో సహా సైబర్ క్రైమ్ అధికారులకు అందచేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు.
మరీ ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో తనను చాలామంది టార్గెట్ చేసి ట్రోల్ చేశారని అన్నాడు. అయితే ఆ టైమ్ లో వారిపై తాను దృష్టి పెట్టలేదని, ఇక ఇప్పుడు వారిని క్షమించేది లేదని చెప్పాడు. నూటికి పదిహేను శాతం మంది ప్రతి వారినీ టార్గెట్ చేస్తూ మీమ్స్ చేస్తారని, వారిని తాను పెద్దగా పట్టించుకోనని, స్పోర్టివ్ గా తీసుకుంటానని, కానీ పని కట్టుకుని తన కుటుంబాన్ని విమర్శించే వారు మాత్రం దానికి తగిన ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుందని విష్ణు అన్నాడు. ఇలా తనను విమర్శించే వారికి ఆర్గానిక్ గానే ఇటీవల పెద్ద దెబ్బ పడిందని, ప్రకృతే వాళ్ళను చూసుకుంటుందని నర్మగర్భంగా ఓ స్టార్ హీరోను ఉద్దేశించి విష్ణు వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే అక్టోబర్ 5న రావాల్సిన ‘జిన్నా’ సినిమాను విష్ణు 21వ తేదీకి వాయిదా వేశాడు. అయితే ఐదో తేదీన ఆ మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. విశేషం ఏమంటే… ‘జిన్నా’ సినిమాలోనూ తనపై, తన కుటుంబంపై ట్రోల్ చేసే వారిపై ఓ డైలాగ్ ఉందట. ”నన్ను ట్రోల్ చేయి… ఎంజాయ్ చేస్తాను. కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే తాట తీస్తాను” అని విష్ణు ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఇందులో చెప్పాడని తెలుస్తోంది. ‘జిన్నా’ మూవీ తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.