సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు అత్యంత ఘనంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోబోతుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే హంగామా సృష్టిస్తున్నారు. ఇక తాజాగా అభిమానులు ఫిదా అయ్యేలా మహేష్ వారికి ఒక ప్రత్యేకమైన లేఖ రాశారు. “సర్కారువారి పాట షూటింగ్ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది.
ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన ‘సర్కారువారి పాట’ చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు’ అని తెలిపారు. అంతేకాకుండా తన తదుపరి చిత్రం కు సంబంధించిన అప్డేట్ ను కూడా పొందుపరిచారు. “మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు)నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలుకాగలదు” అని తెలిపారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇలాంటి లేఖనే పోకిరి సమయంలో మహేష్ రాశాడు. మరోసారి ఇప్పుడు ‘సర్కారువారి పాట’ కు రాశాడు. దీంతో ఈ రెండు లేఖలను పక్క పక్కన పెట్టి రెండు ఇండస్ట్రీ హిట్లే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.