Mahesh Babu Interesting Comments On Rajamouli Project: మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తోన్న SSMB28 ప్రాజెక్ట్ ముగించుకున్న తర్వాత, జక్కన్నతో మహేశ్ సెట్స్ మీదకి వెళ్లనున్నాడు. అయితే, అదెప్పుడన్నది ఇంకా క్లారిటీ లేదు. బహుశా ఒక ఏడాదికి పైనే సమయం పట్టొచ్చు. అయితే.. సినీ ప్రియులు మాత్రం ఆలోపు వెయిట్ చేయలేకపోతున్నారు. ఈ సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ తెలుసుకోవడం కోసం ఉబలాటపడుతున్నారు. అటు మీడియా సైతం ఏమైనా అప్డేట్స్ లీక్ అవుతాయా? అని వెయిట్ చేస్తోంది.
ఈ క్రమంలోనే మహేశ్ బాబు తాజాగా జక్కన్నతో ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాజమౌళితో కలిసి పని చేయాలన్న నా కల నెరవేరబోతోంది. జక్కన్నతో ఒక సినిమా చేయడమంటే, 25 సినిమాలకు సమానం. ఈ చిత్రం కోసం నాకు శారీరకంగానూ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇదొక పాన్ ఇండియా సినిమా. ఈ చిత్రంతో మేము హద్దులన్నీ చెరిపేసి, ప్రతి భారతీయుడికి మా పనిని చేరవేస్తాం. నిజంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను’’ అంటూ మహేశ్ చెప్పుకొచ్చాడు. శారీరకంగా కష్టపడాల్సి వస్తుందని మహేశ్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే.. అతడు మనకు కొత్త గెటప్‌లో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతోంది. బాహుబలి కోసం ప్రభాస్ ఎలా బాడీని పెంచాడో, మహేశ్ కూడా అలాగే కసరత్తు చేయనున్నాడేమో చూడాలి.
కాగా.. ఈ సినిమాను కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్, జక్కన్న కలిసి ఒక ఫ్యాంటసీ కథని సిద్ధం చేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే.. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.