Mahesh Babu:దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే సినిమా మొత్తం అయిపోయాక ప్రమోషన్స్ లో మాత్రమే బజ్ ఉంటుంది అనుకొంటే పొరపాటే.. సినిమా మొదలుకాకముందు నుంచే ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి.. అది రాజమౌళి రేంజ్. ఇక అలాంటి దర్శక ధీరుడు, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు అంటే.. అంచనాలు ఆకాశానికి అంటాల్సిందే. సినిమా సెట్ మీదకు వెళ్లడం దగ్గరనుంచి అందులో ఎవరెవరు నటిస్తున్నారు అనేవరకు అంతా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇక గత కొన్నిరోజులుగా ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, అవెంజర్స్ హీరో క్రిస్ హేమ్స్‌వర్త్ నటిస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే.. ఈ సినిమాను రాజమౌళి గ్లోబల్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకురావడంతో హాలీవుడ్ హీరోలను కూడా రంగంలోకి దింపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, అభిమానులకు ఆశలు పెట్టవద్దని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
ఇక తాజాగా ఈ చిత్రంలో క్రిస్ నటిస్తున్నది నిజమేనట. అందుకు సాక్ష్యం కూడా ఉందని మహేష్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. మహేష్ తన ఇన్స్టాగ్రామ్ లో క్రిస్ ను ఫాలో అవుతున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. చాలా తక్కువమందిని ఫాలో అయ్యే మహేష్ గత కొన్నిరోజులుగానే క్రిస్ ను ఫాలో అవుతున్నాడని.. అతను కూడా మహేష్ ను ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ వార్తలో నిజం లేకపోలేదు అని అభిమానులు చెప్పుకొంటున్నారు. ఒకవేళ ఈ వార్తే నిజమైతే మహేష్ అభిమానులకు పూనకాలు రావడం ఖాయమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇక జక్కన్న కు హాలీవుడ్ హీరోలను హ్యాండిల్ చేయడం కొట్టిన పిండి. అందులోనూ హాలీవుడ్ తారలకు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ ఎంట్రీ దొరకడమంటే అదృష్టమనే చెప్పాలి. ఇక ఇలాంటి అభిప్రాయంతోనే క్రిస్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.