ప్రముఖ కథానాయకుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టు నుండి ఊరట లభించింది. విశాల్ నిర్మించిన ‘చక్ర’ సినిమాకు సంబంధించిన వివాదం ఒకటి కొంతకాలంగా కోర్టులో నానుతోంది. ఈ సినిమా దర్శకుడు తొలుత కథను తమకు చెప్పాడని, అది నచ్చి తాము సినిమా నిర్మించడానికి సిద్ధపడిన తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకు ఎక్కింది. అయితే… కోర్టు దీనిని కొట్టేసింది. అంతేకాదు… విశాల్ పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రూ. 5 లక్షల జరిమానాను లైకా కు విధించింది. ఈ విషయాన్ని విశాల్ తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా తెలిపాడు. న్యాయస్థానాల మీద తనకు ఉన్న నమ్మకం నిజమైందని, సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుందనేది మరోసారి రుజువైందని విశాల్ పేర్కొన్నాడు. తన మీద, ‘చక్ర’ మూవీ మీద పెట్టిన కేసును కోర్టు డిస్మిస్ చేయడంతో పాటు లైకా కంపెనీకి పెనాల్టీ వేయడంపై విశాల్ హర్షం వ్యక్తం చేశాడు.