తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘మారన్’ మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. సోమవారం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. దానికి సరిగ్గా కొద్ది గంటల ముందే చిత్ర నిర్మాత టి. జి. త్యాగరాజన్… ధనుష్ అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ను అందించారు. ఈ మూవీ టైటిల్ హ్యాష్ ట్యాగ్ కు ట్విట్టర్ లో ధనుష్ లోగోను పెట్టారు. ఈ రకంగా సినిమా పేరుపక్కనే హీరో బొమ్మ పెట్టడం అనేది తమిళ నాట ట్విట్టర్ లో మొట్టమొదట విజయ్ ‘మెర్సల్’ మూవీకి జరిగింది. ఆ తర్వాత విజయ్ ‘మాస్టర్, బిగిల్’ సినిమాలతో పాటు రజనీకాంత్ ‘కాలా, దర్బార్’ చిత్రాలకు, సూర్య ‘ఎన్జీకే, సూరారై పొట్రూ’ చిత్రాలకు జరిగింది.
ధనుష్ తాజా చిత్రం ‘మారన్’ విషయానికి వస్తే… సోమవారం విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. జర్నలిస్టులైన హీరో ధనుష్, హీరోయిన్ మాళవికా మోహనన్ జీవితంలో జరిగిన కీలక సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. రాజకీయ నేతలు, పోలీసు అధికారులు చేతులు కలిపితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎలాంటి ఇబ్బందులు పడతాడనేది ఇందులో కీలకాంశంగా కనిపిస్తోంది. కార్తీక్ నరేశ్ దర్శకత్వం వహించిన ‘మారన్’లో సముతిర కని, స్మృతి వెంకట్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ‘జగమే తంత్రం, అత్రంగి రే’ చిత్రాల తర్వాత ఓటీటీలో వస్తున్న ధనుష్ చిత్రం ‘మారన్’. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత స్ట్రీమింగ్ కాబోతున్న ధనుష్ ‘మారన్’కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.