తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చెన్నైలో ‘బీస్ట్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి తెలుగు సినిమాపై దృష్టి పెట్టనున్నాడు విజయ్. ఇదిలా ఉంటే గురువారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైలో విజయ్ సెట్ సందర్శించాడు.ఈ సందర్భంగా ధోనీ, విజయ్ కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సహచరులతో కలిసి చెన్నైలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ త్వరలో UAE లో జరగబోతున్న ఐపిఎల్ కోసం బయలుదేరనుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇండియాలో జరగ వలసిన ఈ టోర్నమెంట్ మధ్యలోనే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడి త్వరలో యు.ఎ.ఇ లో మొదలు కానుంది.
చెన్నై పర్యటన సమయంలో ధోనీ కొంత మంది స్నేహితులను కలుస్తున్నాడు. అయితే విజయ్‌తో ధోనీ సమావేశం ప్రాంతీయ, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడటం మొదలుపెట్టినప్పటి నుండి చెన్నై అతని రెండవ ఇల్లుగా మారింది. అభిమానులు ముద్దుగా ధోనిని ‘తల’ అని పిలుస్తారు. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్ ను అందరూ తలపతి అని అంటుండటం తెలిసిందే. సో తల, తలపతి కలయిక తమిళ సినీ అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం వీరిద్దరి కలయిక పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.