మొన్నటి తరం బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రేమకథ అంటే ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’! ఈ తరం వారికి అలాంటి దృశ్య కావ్యం అందిస్తామని చెబుతున్నాడు రచయిత, దర్శకుడు నితిన్ కుమార్ గుప్తా. కమల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నితిన్ ‘లవ్ ఇన్ ఉక్రెయిన్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించాడు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించడానికి కొన్ని నెలల ముందు ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. భారత్ కు చెందిన ఓ విద్యార్థి చదువు నిమిత్తం ఉక్రెయిన్ వెళ్ళి అక్కడో రష్యన్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే ఓ మాఫియా డాన్ కుటుంబ సభ్యుడితో ఆమెకు ఎంగేజ్ మెంట్ జరిగిపోతుంది. వీరిద్దరూ ఆ విపత్తును ఎలా ఎదుర్కొన్ని ఒక్కటయ్యారన్నది ఈ చిత్ర కథ.
ఉక్రెయిన్ లోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఇందులో చూపించారు. విపిన్ కౌశిక్ హీరోగా, లిజాబెటా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రధాన తారాగణం అంతా అక్కడి స్థానికులే. బాధాకరం ఏమంటే ఇప్పుడు వారంతా రష్యా చేస్తున్న దాడుల కారణంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవితాన్ని సాగిస్తున్నాయి. తాజాగా ‘లవ్ ఇన్ ఉక్రెయిన్’ మూవీ ఫస్ట్ లుక్ ను దర్శక నిర్మాతలు విడుదల చేశారు. సినిమాను కూడా ప్రపంచవ్యాప్తంగా మే 27న రిలీజ్ చేయబోతున్నారు. ఉక్రెయిన్ దేశీయుల పట్ల సంఘీభావం తెలియచేసే చిత్రమిదని దర్శకుడు నితిన్ కుమార్ గుప్తా చెబుతున్నాడు.