యూత్ లో ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. ఇక విడాకులు తీసుకున్నా దక్షిణాదిన ఏ మాత్రం ఫామ్ కోల్పోని హీరోయిన్ సమంత. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమానే ‘ఖుషి’. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మైత్రీ మూవీస్ సంస్థ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి విజయ్ అభిమానుల్లో పెరిగింది. నిజానికి ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత విజయ దేవరకొండ కెరీర్ కుదుపుకు లోనయిందనే చెప్పాలి. కానీ ‘ఇస్మార్ శంకర్’ హిట్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న పూరి జగన్నాథ్ విజయ్ తో ‘లైగర్’ అనే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేపట్టడం… ప్యాన్ ఇండియా సినిమాకు ప్రత్యేకించి తెలుగు సినిమాలకు ఫుల్ బూమ్ రావటంతోపాటు అనన్య పాండే హీరోయిన్ కావటం, మైక్ టైసన్ వంటి ఇంటర్నేషనల్ స్టార్ నటించటం, కరణ్ జోహార్, యశ్ రాజ్ ఫిలిమ్స్ వంటి బాలీవుడ్ బిగ్గీస్ ఇన్ వాల్వ్ కావటంతో ‘లైగర్’ వార్తల్లో నిలుస్తూ వచ్చింది.
ఇప్పుడు ‘లైగర్’ తర్వత సినిమాకు ‘ఖుషి’ టైటిల్ పెట్టడం ఓ విధంగా ప్లస్ అనుకోవాలి. మరో విధంగా మైనస్ అనుకోవాలి. పవన్ నటించిన ‘ఖుషి’ విడుదలై 20 సంవత్సరాలు దాటుతోంది. ఇప్పటికీ ఆ సినిమా అభిమానుల మదిలో మెదలుతూనే ఉంది. అయితే విజయ్ దేవరకొండ వంటి సెన్సేషనల్ స్టార్ సినిమాకు ఈ టైటిల్ పెడతారని ఎవరూ అనుకోలేదు. ఇలాంటి సూపర్‌హిట్ టైటిల్స్ పెట్టేటపుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్ టైటిల్ తో వచ్చిన సినిమా స్థాయిలో లేకుంటే ప్రేక్షకులు తిప్పికొడతారు. అందుకు నాని ‘గ్యాంగ్ లీడర్’ ఓ ఉదాహరణ. ఇది కాకుండా ‘బంగారు బుల్లోడు, పెళ్ళిసందడి, విజేత, దేవదాస్, రాక్షసుడు, చాణక్య, రన్, వివాహభోజనంబు, పుష్పక విమానం, ఇష్క్, మనవూరి పాండవులు’ వంటి సినిమాలు కూడా ఎంగానో నిరాశపరిచాయి. ఇలాంటి టైటిల్స్ తో వచ్చే సినిమాలు కొంచెం బాగుంటే చాలదు. అదిరిపోయేలా ఉండాలి. ఇక శివ నిర్వాణ గత చిత్రం ‘టక్ జగదీష్’, విజయ్ దేవరకొండ, మైత్రీ మూవీస్ వారి ‘డియర్ కామ్రేడ్’ ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయాయి. ఇప్పుడు ఈ ముగ్గురు కలయికలో వస్తున్న ‘ఖుషీ’ మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ రాబోయే సినిమా ‘లైగర్’ సక్సెస్ అయితే తప్ప ‘ఖుషీ’ కి క్రేజ్ రాదు. మరి ‘ఖుషి’ విజయ్ దేవరకొండకు ఖుషీని అందిస్తుందా!? ‘లైగర్, ఖుషీ’తో విజయ్ తన మునుపటి ఫామ్ ను అందిపుచ్చుకుంటాడేమో చూద్దాం.