‘ఉప్పెన’తో తెలుగు చిత్రసీమలోకి సునామీలా దూసుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ కృతీశెట్టి. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వెల్లువల పొంగుకొచ్చాయి. అయితే అదే సమయంలో ఆచితూచి అడుగులు వేయడం మొదలెట్టింది కృతి. నేచురల్ స్టార్ నాని సరసన ఆమె చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కృతి కంటే… సాయిపల్లవికే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘బంగర్రాజు’ సినిమాలో నాగచైతన్య సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మరో విశేషం ఏమంటే… ‘ఉప్పెన’తో కృతిని తెలుగు సినిమా రంగంలోకి తీసుకొచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తాము నిర్మిస్తున్న ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో కృతీశెట్టినే హీరోయిన్ గా తీసుకుంది. సుధీర్ బాబు ఈ సినిమాలో హీరో కాగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు.
కృతీశెట్టి ప్రస్తుతం రామ్ సరసన తెలుగు, తమిళ చిత్రం ‘ది వారియర్’లో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆయన నాగచైతన్య హీరోగా నిర్మించ బోతున్న తెలుగు, తమిళ చిత్రంలోనూ కృతీశెట్టినే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తాజాగా ప్రకటించారు. సో… కృతిశెట్టితో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలు ఆమెతో మరోసారి వర్క్ చేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నాయి. అంతే కాదు… కృతీ నాగచైతన్యతో నటించడం కూడా ఇది రెండోసారి. ఆ మధ్యలో కృతీశెట్టి పారితోషికం భారీగా పెంచేసిందని, ఆమెతో కొంచెం కష్టమని, యాటిట్యూడ్ చూపిస్తుందని కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా ఆమె కమిట్ అవుతున్న సినిమాల జాబితా చూస్తే అందులో వాస్తవం లేదనిపిస్తోంది.