సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి ఈ రోజు ఉదయం తుదిస్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 101 సంవత్సరాలు. శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు.కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారిని వివాహమాడారు.
Also Read : Masthan Sai : మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్
ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో 1949లో ‘మనదేశం’ అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. కాగా కృష్ణవేణి మృతి పట్ల నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ‘ రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నటజీవితానికి తొలుత అవకాశం అందించిన శ్రీమతి కృష్ణవేణి గారు సంపూర్ణ జీవితం చాలించి శివైక్యం చెందడం బాధాకరం. శ్రీమతి కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. మన దేశం లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి కృషి చేశారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డ్స్ అందుకొన్నారు. ఇటీవల ఎన్ టి ఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకు ముందు ఎన్ టి ఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి గారిని ఘనంగా సత్కరించడం జరిగింది. కృష్ణవేణి గారి మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను’ అని అన్నారు.