Krishnam Raju Memorial Service In Mogalturu: మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామం మొగల్తూరులో నిర్వహించారు. ఇప్పటికే కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు హీరో ప్రభాస్ అక్కడికి చేరుకున్నారు. అభిమానులు సైతం భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పటిష్టమైన పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. అభిమానులకు భోజన సదుపాయాలు సైతం ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రభాస్ అభిమానుల్ని పలకరించాడు. లోపలికి వెళ్తూ.. భోజనం ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందరూ తినేసి వెళ్లండని చెప్పాడు. మరోవైపు.. భారీఎత్తున అభిమానులు రావడంతో కృష్ణంరాజు భార్య శ్యామల ఉద్వేగానికి లోనయ్యారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు, ఈనెల 11వ తేదీన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈయన మృతి పట్ల సినీ తారలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు. కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్.. కృష్ణంరాజుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కృష్ణంరాజు కడసారి చూసేందుకు.. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.