క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కృష్ణ వంశీ గత మూడేళ్ళుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం విదితమే.. ఇక ఇటీవలే రంగమార్తాండ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ ఈ సినిమా రిలీజ్ కాకుముందే అన్నం అనే సినిమాను మొదలుపెడుతున్నట్లు ప్రకటించాడు. ఇక చాలా రోజుల తరువాత ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కృష్ణవంశీ అభిమానిలతో ముచ్చటించాడు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ” మీ నుంచి మేము ఖడ్గం లాంటి సినిమాను ఎదురుచూస్తున్నాం.. ఎప్పుడు ఉంటుంది అలాంటి సినిమా” అని అభిమాని అడిగిన ప్రశ్నకు “ఇప్పుడు అలాంటి సినిమా చేస్తే నన్ను చంపేస్తారేమో సార్” అంటూ కృష్ణవంశీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
2002 లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖడ్గం. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ హీరోలుగా సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. తీవ్ర వాదులకు పోలీసులకు మధ్య జరిగిన యుద్ధం.. హిందూ ముస్లింల సమానత్వాన్ని తెలిపే సినిమాగా రూపొందించిన ఖడ్గం ప్రతి భారతీయుడు గర్వంగా చూసే సినిమాగా పేరుతెచ్చుకొంది. ఆగస్టు 15, జనవరి 26 లాంటి ప్రత్యేక రోజు ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ కావడం ఆనవాయితీలా మారిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించిన కృష్ణ వంశీ రంగమార్తాండ చిత్రంతో హిట్ అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.