శతాధిక చిత్రాల దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి తన తండ్రి స్పూర్తి తో కొత్త చిత్రాన్ని ఆరంభించారు. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ ప్రముఖులు అల్లు అరవింద్, మురళీ మోహన్, యస్. వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కోటి, రాజా రవీంద్ర తదితరులు హాజరై, చిత్ర యూనిట్ ను శుభాకాంక్షలు తెలియచేశారు. హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన మహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.
కథానాయకుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ”కోడి రామకృష్ణ గారి దీవెనలతో, చాలా మంది పెద్దల ఆశీస్సులతో మా మూవీ స్టార్ట్ కావడం ఆనందంగా ఉంది. నాకు ఇది సొంత ప్రొడక్షన్ హౌస్ లాంటిది. దీప్తి గారు మొదటి నుంచి నన్ను ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారు. తాను నిర్మిస్తున్న తొలి చిత్రానికి నేను కథానాయకుడు కావడం సంతోషంగా ఉంది. ఇదే నెలలో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది” అని చెప్పారు.
కోడి దివ్య మాట్లాడుతూ, ”మణిశర్మ గారు ఈ చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉంది. మంచి సినిమా తీయాలని ఆకాంక్షతో తొలి అడుగు వేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ మాట్లాడుతూ, ” నేను కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో పాటలు రాయలేదు. ఆ లోటును ఆయన కూతురు దివ్య ఈ సినిమా ద్వారా తీరుస్తున్నారు. కిరణ్ అబ్బవరంతో ‘యస్. ఆర్. కళ్యాణ మండపం’ సినిమాకి వర్క్ చేశాను. మళ్లీ ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తున్న సినిమా ఇది. సగం పాటలు ఇప్పటికే పూర్తయ్యాయి. మణిశర్మ గారు చక్కని ట్యూన్స్ ఇస్తున్నారు” అని అన్నారు.