Kiran Abbavaram: చిత్ర పరిశ్రమలో తమ మొదటి సినిమాలోని హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవుతున్నాడా.. ? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అవును.. ప్రతిసారి ఈవిషయంలో మాత్రం కిరణ్ అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నాడు. రాజావారు రాణిగారు అనే సినిమాతో కిరణ్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఇదే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రహస్య గోరఖ్. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. కానీ, వీరిద్దరూ అధికారికంగా తమ ప్రేమను అభిమానులకు చెప్పలేదు. అయినా అభిమానులు ఊరుకోరు కదా.. ఎలాగోలా కనిపెట్టేసి వీరిద్దరి ప్రేమను కన్ఫర్మ్ చేసేశారు. ఈ మధ్యనే కిరణ్ ఇంటి గృహప్రవేశం వేడుకలో రహస్య పూలు గుచ్చుతూ.. ఇంటి మనిషిలా కనిపించింది. ఇలా ప్రతిసారి ఈ జంట రిలేషన్ లో ఉన్నారని రుజువు చేస్తూనే ఉన్నారు.
ఇక ఎట్టకేలకు ఈ జంట తమ రిలేషన్ ను అధికారికంగా బయటపెట్టేసింది. అవును, అందుతున్న సమాచారం ప్రకారం ఈ బుధవారం కిరణ్- రహస్య ల ఎంగేజ్ మెంట్ ఘనంగా జరగనుంది. అయిదేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఎంగేజ్ మెంట్ కూడా కిరణ్ తన సొంత ఇంట్లో అత్యంత బంధుమిత్రుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఎట్టకేలకు కిరణ్.. ‘రహస్య’ ప్రేమికురాలితో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. ఈ విషయం తెలియడంతో అభిమానులు కిరణ్ అబ్బవరానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.