విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ఖుదా హఫీజ్ ఛాప్టర్ 2. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫరూక్ కబీర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఓ వీడియో సాంగ్‌ను ఓ మతాన్ని కించపరిచే విధంగా చిత్రీకరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో షియా కమ్యూనిటీ పెద్దలు ఫిర్యాదు చేశారు. వెంటనే వీడియో సాంగ్ డిలీట్ చేయకుంటే దేశ వ్యాప్త నిరసనలు చేస్తామని హెచ్చరించారు.
కాగా ఇటీవల ఖుదా హఫీజ్-2 మూవీ నుంచి విడుదలైన హక్ హుస్సేన్ అనే వీడియో సాంగ్‌లో మాతం నిర్వహించే సమయంలో కత్తులతో హింస ప్రేరేపించే విధంగా చిత్రీకరణ జరిపారంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ పాటను వెంటనే తొలగించాలని షియా కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హీరో విద్యుత్ జమ్వాల్ ఆదివారం నాడు హైదరాబాద్ వచ్చి ప్రమోషన్‌లు కూడా నిర్వహించాడు. తనకు తారక్ అంటే ఇష్టమని కూడా విద్యుత్ జమ్వాల్ చెప్పాడు.