‘కేజీఎఫ్-2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలచింది మొదలు అన్ని భాషల్లోనూ గణనీయమైన వసూళ్ళు చూస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఓ వెయ్యి కోట్ల రూపాయలు పోగేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఈ సినిమా ‘బాహుబలి-2’ను అధిగమిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అది కలలోని మాటే అని చెప్పాలి. ఎందుకంటే ‘బాహుబలి-2’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఎటు చూసినా ‘కేజీఎఫ్-2’ కు అంత సీన్ లేదని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ బాబులు మాత్రం ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్ తో ‘కేజీఎఫ్-2’ హిందీ అనువాదానికి పోటీ పెడుతున్నారు. టోటల్ రన్ లో ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్ రూ.510.99 కోట్లు పోగేసింది. ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ ఇప్పటి దాకా రూ. 200 కోట్లు కొల్లగొట్టిందని వారాంతానికి రూ.250 కోట్లు చూసే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే, మరో రూ.261 కోట్లు రాబడితేనే ‘కేజీఎఫ్-2’ అంతకు ముందున్న ‘బాహుబలి-2’ రికార్డును అధిగమిస్తుందని చెబుతున్నారు.
అప్పుడే ‘బాహుబలి-2’తో ‘కేజీఎఫ్-2’ ను పోల్చడం సరికాదని సీనియర్ ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 22న షాహిద్ కపూర్ ‘జెర్సీ’ వస్తోంది. ఇక ఏప్రిల్ 29న తెలుగులో చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ విడుదల కానుంది. అదే తేదీన హిందీ చిత్రాలు అజయ్ దేవగణ్ “రన్ వే 34”, టైగర్ ష్రాఫ్ “హీరో పంతి -2′ కూడా జనం ముందు నిలువనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాదినే కాదు, దక్షిణాదిన సైతం ‘కేజీఎఫ్-2’కు థియేటర్లు తగ్గుతాయి. ఇక నార్త్ లో మూడు హిందీ సినిమాల మధ్యలో ‘కేజీఎఫ్-2’ సీన్ చితికిపోక తప్పదనీ ట్రేడ్ పండిట్స్ అంచనా! అదీగాక ‘బాహుబలి-2’ హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమా అని, అందులోని పాటలు అవీ కూడా జనాన్ని ఆకట్టుకున్నాయని, సెంటిమెంట్ సీన్స్ కూడా భలేగా పండాయని గుర్తు చేస్తున్నారు. అందువల్ల అనేక రోజులు ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిందనీ చెబుతున్నారు. ఏది ఏమైనా టోటల్ రన్ లో ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ రూ.325 కోట్లు రాబట్టగలదని, లేదా మరో రూ.25 కోట్లు అదనంగా పోగేయగలదని బాలీవుడ్ బాబులు తేల్చేశారు.