OTR : తెలంగాణలో మరో ఉద్యమానికి తెరలేపింది బీఆర్ఎస్. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కీలకమైన సికింద్రాబాద్ కోసం ఆందోళనలకు సిద్దమవుతోంది. సికింద్రాబాద్ బచావో పేరుతో నిరసనలకు మొదలుపెడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రగడ ప్రారంభమైంది. జంట నగరాలుగా పేరు ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ లలో సికింద్రాబాద్ పేరు లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని లష్కర్ సాధన సమితి పేరుతో రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరగడం, ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు జరిగిపోయాయి. దానితోపాటు కొత్త కార్పొరేషన్ల డివిజన్ కూడా జరగబోతుంది. ఈ పరిస్థితుల్లో సికింద్రాబాద్ అస్తిత్వానికి దెబ్బ కొడుతోంది ఈ ప్రభుత్వం అంటూ మొదలుపెట్టింది లష్కర్ సాధన సమితి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనరేట్ లలో సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజిగిరి కమిషనరేట్ లో కలపడాన్ని కూడా నిరసిస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
READ ALSO: OTR: బృహన్ ముంబై కార్పొరేషన్ ఫలితాలతో గ్రేటర్ బీజేపీ కాన్ఫిడెన్స్
కొత్త మున్సిపల్ కార్పొరేషన్‌కు సికింద్రాబాద్ పేరు పెట్టాలని డిమాండ్
దాదాపు 220 ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ను కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరిలో కలపడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు లష్కర్ నేతలు. ఈ కమిషనరేట్ పరిధిలోకి బేగంపేట్ , సికింద్రాబాద్ ప్రాంతాలన్నీ వస్తున్నాయని, దానికి తాము ఒప్పుకోమంటున్నారు. దాంతోపాటు జిహెచ్ఎంసిలో ఏర్పడబోయే కొత్త మున్సిపల్ కార్పొరేషన్…సికింద్రాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, దానికి సికింద్రాబాద్ పేరు పెట్టాలని గట్టిగా అడుగుతున్నారు. ఈ ఉద్యమంలో శాంతియుత ర్యాలీకి తలసాని పిలుపు ఇవ్వడం, దానికి బీఆర్ఎస్ మద్దతు కూడా ఇచ్చింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహం
సికింద్రాబాద్ ప్రాంతంలో గులాబీ పార్టీకి ఎమ్మెల్యేలు వున్నారు. సికింద్రాబాద్, సనత్ నగర్, అంబర్పేట్ ,ముషీరాబాద్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ బలంగా వుంది. అందుకే సికింద్రాబాద్ బచావో పేరుతో ఈ ప్రాంతంలో ఉద్యమం ప్రారంభిస్తే తమకు కలిసి వస్తుందని లెక్కలేస్తోంది. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎక్కువ డివిజన్లు గెలిచేందుకు ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ అస్తిత్వ పోరాటం మొదలుపెట్టింది. సికింద్రాబాద్ బచావో పేరుతో మొదలైన ఈ ఉద్యమాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తామంటున్నారు గులాబీ నేతలు. గతంలో తమకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన అనుభవం ఉందని, అలాగే సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కూడా చేస్తామని తెగేసి చెబుతున్నారు.