గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ ఓటీటీలో విడుదల అయ్యాయి. థియేట్రికల్ రిలీజ్ కాకపోవడంతో అవి ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేశాయనే విషయం చెప్పలేం. అయితే నిర్మాతలు మాత్రం మంచి లాభానికే ఓటీటీ సంస్థలకు ఆ చిత్రాలను అమ్మారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… ఈ యేడాది మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రంలో కీర్తి సురేశ్ ఊహించని విధంగా తెరపై మెరుపులా మెరిసింది. అతిథి పాత్రను మించి ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. అలానే ఇదే నెలలో ఆమె నటించిన ‘పెద్దన్న’ చిత్రమూ విడుదలైంది.
ఇంతకూ విషయం ఏమంటే… డిసెంబర్ ప్రథమార్ధంలో కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. అందులో ఒకటి మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మరక్కర్’. ఇది డిసెంబర్ 2న వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీలో ఆర్చ అనే పాత్రను కీర్తి చేస్తోంది. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘మరక్కర్’లో అర్జున్ సర్జా, సునీల్ శెట్టి, ప్రభు, మంజూ వారియర్, ముఖేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా వెనుకే కీర్తి సురేశ్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ డిసెంబర్ 10న విడుదల కాబోతోంది. ఈ రెండూ కూడా కీర్తి సురేశ్ కు చాలా ప్రత్యేకమైన చిత్రాలు.