Kaylee Hottle: హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కేలీ హాటిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూయడం సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జార్జియాలో జన్మించిన కేలీ హాటిల్ చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. ఆమె తండ్రి వైపు కుటుంబంలో నాలుగు తరాలుగా వినికిడి సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అమెరికన్ సైన్ లాంగ్వేజ్ (ASL) ద్వారా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సంభాషించేవారు. ఇదే అనుభవం ఆమె నటనా ప్రయాణంలో కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
2021లో విడుదలైన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’సినిమాలో కేలీ హాటిల్ జియా పాత్రలో నటించారు. ఈ చిత్రంలో కాంగ్‌తో సైన్ లాంగ్వేజ్ ద్వారా భావోద్వేగాలను వ్యక్తం చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత వచ్చిన ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ సినిమాలోనూ కేలీ తన పాత్రను కొనసాగించి అభిమానులను మెప్పించారు. చిన్న వయసులోనే హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకుంటారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా జరిగిన ఈ ప్రమాదంలో కేలీ హాటిల్ మరణించడం హాలీవుడ్‌కు తీరని లోటుగా మారింది. ఆమె మరణ వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే తన ప్రతిభతో ప్రపంచ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కేలీ హాటిల్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

