“ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కోవాలి” అని సామెత. అందాల భామ కత్రినా కైఫ్ మనసు చిత్రసీమలో పారేసుకుంది. అయితే ఆరంభంలో ఆమె ఎత్తు ఓ అడ్డంకిగా మారింది. అసలు నటన రాదన్నారు. ఇంకొందరు ఐటమ్ సాంగ్స్ కు పరవాలేదన్నారు. ఇలాంటి విమర్శల నడుమ తనను తాను తీర్చిదిద్దుకొని, బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న తారల్లో ఒకరిగా కత్రినా కైఫ్ జయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత ఎందరికో కత్రినా స్ఫూర్తిగా నిలచింది. దేశవ్యాప్తంగా ఎనలేని అభిమానగణాలను సంపాదించుకుంది కత్రినా కైఫ్.
కత్రినా కైఫ్ 1983 జూలై 16న హాంగ్ కాంగ్ లోని విక్టోరియాలో జన్మించింది.
బ్రిటన్ లో స్థిర పడిన కశ్మీర్ రూట్స్ ఉన్న మొహమ్మద్ కైఫ్, బ్రిటన్ కు చెందిన లాయర్ సుజన్నే దంపతుల కూతురు కత్రినా. ఆమెకు ముగ్గురు అక్కలు, ఓ అన్న, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి ఆలనాపాలనలోనే కత్రినా పెరిగింది. 14 ఏళ్ళ వయసులో కత్రినా కైఫ్ ఓ కాంటెస్ట్ లో బ్యూటీగా ఎన్నికయింది. ఆ తరువాత ఓ స్నేహితురాలి సలహా మేరకు ఇండియా చూడాలని వచ్చింది. తన తండ్రి స్వదేశమైన ఇండియా ఆమెకు భలేగా నచ్చేసింది. కత్రినా పాల్గొన్న ఓ ఫ్యాషన్ లో ఆమెను చూసి బాలీవుడ్ ఫిలిమ్ మేకర్ కైజాద్ గుస్తాద్ ఇండియాకు ఆహ్వానించాడు. తన ‘బూమ్’లో ఓ కేరెక్టర్ ను ఇచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢామ్ అంది. ఆమె నటించిన రెండో చిత్రమే తెలుగు సినిమా ‘మల్లీశ్వరి’. వెంకటేశ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అంటే కత్రినాకు తొలి సక్సెస్ ను రుచి చూపించింది తెలుగు సినిమానే అన్న మాట! ఆ తరువాత బాలీవుడ్ లో మంచి అవకాశాలు రాసాగాయి. వచ్చిన ప్రతీ ఛాన్స్ నూ వినియోగించుకుంటూ ముందుకు సాగింది కత్రినా. బాలకృష్ణ సరసన ‘అల్లరి పిడుగు’లో జోడీ కట్టింది. బాలీవుడ్ లో బిజీ కావడంతో మళ్ళీ తెలుగు సినిమావైపు చూడలేదు కత్రినా.
కత్రినా, సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ క్యు కియా?’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తరువాత అక్షయ్ కుమార్ తో జోడీ కట్టి “నమస్తే లండన్, వెల్ కమ్, సింగ్ ఈజ్ కింగ్, దే ధనా ధన్, తీస్ మార్ ఖాన్” చిత్రాలలో అలరించింది. అక్షయ్-కత్రినా హిట్ పెయిర్ గా నిలిచారు. సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గా వచ్చినా, తరువాత ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’లో రణబీర్ కపూర్ తో నటించి, అతనితో ప్రేమాయణం సాగించింది. వారిద్దరూ నటించిన ‘రాజ్ నీతి’ కూడా ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ తో నటించిన ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై’ చిత్రాలు కూడా మంచి ఆదరణ పొందాయి. ఆమిర్ ఖాన్ తో ‘ధూమ్-3’లో నటించి మురిపించింది. ‘జిందగీ న మిలేగీ దుబారా’లోనూ కనువిందు చేసింది. అయితే ఆమె అసలైన ఎస్సెట్ డాన్స్ అనే చెప్పాలి. ఒకప్పుడు డాన్సులు రావని గేలిచేసిన వారే, తరువాత కత్రినా డాన్సుల కోసమే ఆమెతో పనిచేయడం విశేషం. ‘తీస్ మార్ ఖాన్’లో కత్రినా డాన్స్ చేసిన “షీలా కీ జవానీ…” సాంగ్ దేశాన్ని మొత్తం ఓ ఊపు ఊపేసింది. ఆ తరువాత అనేక చిత్రాలలో కత్రినా ఐటమ్ సాంగ్స్ లోనూ మురిపించడం విశేషం!
సల్మాన్ తో ప్రేమాయణం, రణబీర్ తో రాసలీల అంటూ సాగిన కత్రినా కైఫ్ చివరకు తన కంటే వయసులో ఐదేళ్ళు చిన్నవాడయిన విక్కీ కౌశల్ ను గత సంవత్సరమే పెళ్ళాడింది. ప్రస్తుతం ‘ఫోన్ బూత్, మెర్రీ క్రిస్మస్, టైగర్ 3’లో కత్రినా నటిస్తోంది. పెళ్ళయిన తరువాత కూడా నటించి, తడాఖా చూపించిన తారలెందరో ఉన్నారు. వారి జాబితాలో కత్రినా కైఫ్ సైతం చేరుతుందేమో చూడాలి.