టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక వరుస సినిమాల్లో ఒకటి ‘కార్తికేయ 2’ . నిఖిల్ నటించిన కార్తికేయ కు సీక్వెల్ గా చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
“శంతను .. ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను కేవలం సమిధను మాత్రమే.. అక్కడ ఆజ్యం మళ్లీ మొదలయ్యింది” అన్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యి చివరివరకు ఎంతో ఆసక్తిగా సాగింది. ప్రశ్నలు అంటే పడని ఒక కుర్రాడు సమాధానాల కోసం వెతుకుతూ తిరగడమే కథగా తెలుస్తోంది. ద్వారకా నగరంలోని సముద్రం లోపల ఉన్న కృష్ణుడి గురించిన రహస్యం ఏంటి..? ఆయనకు, హీరోకు ఉన్న సంబంధం ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక నిఖిల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలవు’,‘ విశ్వం ఒక పూసల దండ.. ప్రతిదీ నీకు సంబంధమే.. ప్రతిదీ నీ మీద ప్రభావమే..’ లాంటి డైలాగులు సినిమా అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక నిఖిల్, అనుపమ పెయిర్ ఫ్రెష్ గా ఉంది. మొత్తానికి ట్రైలర్ 1 తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు చందూ .. రెండో ట్రైలర్ ను రేపు సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమాతో నిఖిల్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.