Karthi Missed This Superhit Film Because Of Rajinikanth: దానే దానే పే లిఖా హోతా హై జిస్కా నామ్ అన్నట్టు.. ఎవరికి ఏ సినిమా దక్కాలో, అది వారికే దక్కుతుంది. మధ్యలో ఎన్ని చేతులు మారినా, ఎవరో ఒకరు ఓకే చెప్పినా.. ఎలాగోలా అది రాసిపెట్టిన వాడి వద్దకే వెళ్తుంది. ఇందుకు నిదర్శనంగా ఎన్నో సందర్భాలున్నాయి. కొన్ని చిత్రాలు సెట్స్ దాకా వెళ్లి ఆగిపోయి, మరో హీరో చేసిన ఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలు. అలాంటి సందర్భమే తన విషయంలోనూ జరిగిందని చెప్పాడు తమిళ హీరో కార్తీ. ఓ హిట్ సినిమాను తాను కోల్పోయానని.. తాను సంతకం చేసినప్పటికీ, పరిస్థితులు సహకరించకపోవడంతో మరో హీరో చేతికి వెళ్లిపోయిందని అన్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏది? అని అనుకుంటున్నారా! మరేదో కాదు.. సర్పట్టా పరంబరై (సార్పట్టా పరంపర)!
పా. రంజిత్, ఆర్య కాంబోలో రూపొందిన ఈ సినిమా.. గతేడాది జులైలో నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ పీరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రానికి ప్రేక్షకులు సహా విమర్శకుల నుంచి మంచి రిపోర్ట్స్ వచ్చాయి. అయితే.. ఈ సినిమాను మొదట తాను సంతకం చేశానంటూ షాకిచ్చాడు కార్తీ. 2014లోనే పా. రంజిత్, తన మధ్య ఆ సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయని.. అప్పుడు తాను గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చానని తెలిపాడు. అయితే.. ఇంతలో దర్శకుడికి సూపర్‌స్టార్ రజినీకాంత్ నుంచి ‘కబాలి’ పలుపు రావడంతో.. అతడు ఆ ప్రాజెక్ట్‌లో బిజీ అయ్యాడన్నాడు. ఆ తర్వాత మళ్లీ రజినీతోనే ‘కాలా’ సినిమా చేసే ఛాన్స్ దర్శకుడికి దక్కిందన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీ అయ్యానని.. ఫలితంగా ‘సార్పట్ట పరంపర’ సినిమా తన చేజారిందని కార్తీ చెప్పుకొచ్చాడు. ఆ చిత్రంలో తనకు వాతియర్, డాడీ పాత్రలు బాగా నచ్చాయని కూడా తెలిపాడు.
కాగా.. తమిళంతో పాటు తెలుగులోనూ సమాన ఫాలోయింగ్ కలిగిన కార్తీ, రీసెంట్‌గా ‘విరుమన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. నిజానికి.. కార్తీ చేసే ప్రతీ తమిళ సినిమా, తెలుగులోనూ ఏకకాలంలో రిలీజ్ అయ్యేది. కానీ, ఈ విరుమన్‌ని మాత్రం రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం కార్తీ ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది.