గత మూడు రోజుల నుంచి నటి కరాటే కళ్యాణి వివాదం రోజురోజుకు ముదురుతోందే కానీ తెగడం లేదు. నిన్నటి నుంచి కరాటే కళ్యాణి మిస్సింగ్, కిడ్నాప్. పాపతో పారిపోయింది. ఎవరో ఎత్తుకెళ్లారు అంటూ వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు 24 గంటల తరువాత కళ్యాణి మీడియా ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె ఇంట్లో ఉంటున్న చిన్నారి ఎవరు..? ఏంటి..? అనే ప్రశ్నలకు సమాధానంగా చిన్నారి అసలైన తల్లిదండ్రులను కూడా మీడియా ముందు హాజరుపర్చింది. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. తన గురించి గత రెండు రోజుల నుంచి పలు యూట్యూబ్ ఛానెల్స్ పెడుతున్న థంబ్ నెయిల్స్ చూసి ఛీ ఛీ సమాజ ఇంత నీచంగా ఉందా అని.. ఒక ఆడపిల్ల గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ ఎమోషనల్ అయ్యింది.
“నిన్నటి నుంచి చూస్తున్నాను.. నేను చిన్నారిని ఎత్తుకొని పారిపోయాను అని వార్తలు వచ్చాయి.. నేను పారిపోయే రకం కాదు పారిపోయేట్టు చేసే రకం.. పరిగెత్తే రకం కాదు.. పరిగెత్తించే రకం.. నేను నా హెల్త్ బాగోక వేరే దగ్గరకు వెళ్తే ఏవేవో రాశారు.. ఛీ ఇంత నీచమైన సమాజంలో నేను ఉన్నానా..? అనిపిస్తోంది. మీ అక్కో చెల్లో గురించి ఇలా రాయమంటే రాస్తారా..? నేను ఏ తప్పు చేయలేదు.. సమాజంలో జరిగే అఘాయిత్యాలను ప్రశ్నిస్తే నాకు మీరు ఇచ్చే గౌరవం ఇది. నేను అంటే గిట్టని వారు, నాపై కక్ష కట్టినవారు నన్ను తొక్కేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ.. ఒక ఆడదాన్ని ఎదుర్కోలేని మీరు.. ఏం మగాళ్రా.. నాతో ఫైట్ చేసే దైర్యం లేక ఇన్ని రకాల దాడులు చేస్తారా..?. కొన్నిరోజుల క్రితం ఒక అత్యాచార బాధితురాలి గురించి ఒక పోస్ట్ పెడితే.. వాడెవడో వెధవ నాపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాడు. పోస్ట్ పెట్టడం కూడా తప్పా.. మేము భయపడలేదు. కోర్టుకు వెళ్ళాను.. అది ఫేక్ కేసు అని కోర్టు చెప్పింది.. దీంతో వాడికి చెంప పెట్టు అన్నట్లు జరిగింది.” అని చెప్పుకొచ్చింది.