ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిట్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో, స్టార్ గెస్ట్‌లతో హైలైట్ అవుతూ ఉంటుంది. సినీ, క్రికెట్, టెలివిజన్ ప్రపంచానికి చెందిన అనేక మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు భారత క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ షో లో కనిపించలేదు. దీనికి గల కారణాన్ని కరణ్ తాజాగా బయటపెట్టారు. ఇటీవల భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా నిర్వహిస్తున్న పోడ్‌కాస్ట్ ‘సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా’ లో కరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా, “మీ షోకి రావడానికి నిరాకరించే సెలబ్రిటీ ఎవరు?” అని అడగగా, కరణ్ “రణబీర్ కపూర్” అని సమాధానమిచ్చారు. “అతను గతంలో షో కి వచ్చాడు కానీ గత మూడు సీజన్ల నుంచి రానని చెప్పాడు” అని కరణ్ తెలిపారు.
Also Read : Peddi : ‘పెద్ది’తో నా కల నెరవేరింది.. రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్
అయితే విరాట్ కోహ్లీ గురించి ప్రశ్న రాగానే, కరణ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. “నేను విరాట్ కోహ్లీని ఎప్పుడూ షోకి ఆహ్వానించలేదు. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఘటన తర్వాత నేను ఏ క్రికెటర్లను పిలవడం ఆపేశాను. ఆ సంఘటన తర్వాత చాలా మంది రారని అనుకున్నాను. అందుకే ఇకపై క్రికెటర్లను ఆహ్వానించలేదు” అని కరణ్ చెప్పారు. అసలు ఏం జరిగింది అంటే.. 2019లో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆ ఎపిసోడ్‌లో వీరిద్దరూ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నారు. మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడారని చాలా మంది ఖండించారు. వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆ ఎపిసోడ్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ నుంచి తొలగించారు. అంతేకాక, బీసీసీఐ వారిద్దరినీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తరువాత ఇద్దరూ ప్రజా పరంగా క్షమాపణలు చెప్పారు. ఆ సంఘటనకు తాను కూడా ఒక విధంగా బాధ్యత వహించాల్సి వచ్చిందని కరణ్ జోహార్ అంగీకరించారు. “ఆ ఘటన నాకు పెద్ద పాఠం నేర్పింది. అందుకే ఇకపై క్రికెటర్లను షోకి ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నాను” అని కరణ్ స్పష్టం చేశారు.