ఆడియన్స్ కి ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ నుంచి KGF 2 వరకూ ప్రతి దర్శకుడు ఫాలో అయిన విషయం ఇదే. ఈ కోవలోనే రిలీజ్ అయ్యి సినీ అభిమానులకి విజువల్ ట్రీట్ ఇచ్చిన సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా 16 కోట్ల బడ్జట్ తో తెరకెక్కి, 400 కోట్లు రాబట్టింది. ముందుగా కన్నడకే పరిమితం అయిన ‘కాంతార’ సినిమాని, ఇతర ఇండస్ట్రీల డిమాండ్ మేరకు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. దీంతో రీజనల్ సినిమాగా విడుదలైన ‘కాంతార’ పాన్ ఇండియా మూవీ అయ్యింది. ఓపెనింగ్, క్లైమాక్స్ కాంతార సినిమాకి ప్రాణం పోశాయి. ఈ సీన్స్ లో రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ‘భూతకోల’తో థియేటర్ లో కూర్చున్న వాళ్లకి రోమాలు నిక్కబోడుచుకునేలా చేసిన ‘కాంతార సినిమా’ ఒటీటీలో రిలీజ్ అయితే చూడాలని చాలా మంది వెయిట్ చేశారు.
థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ వస్తుండగానే ‘హోంబేల్ ఫిల్మ్స్’ కాంతార సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమా మూవీని చూడడానికి ఆడియన్స్ ఎగబడతారు అనుకుంటే, అందరికీ షాక్ ఇస్తూ ‘కాంతార’ సైలెంట్ గా ఉంది. థియేటర్స్ లో సూపర్ హిట్ కాంతార సినిమాకి ఒటీటీలో వచ్చిన కాంతార సినిమాకి చాలా తేడా ఉంది. ఈ మూవీకి ఆయువుపట్టు లాంటి ‘వరాహ రూపం’ సాంగ్ ఒటీటీలో లేదు. కాపీ రైట్స్ ఇష్యూతో చిత్ర యూనిట్, ‘వరాహ రూపం’ సాంగ్ ని వేరే పాటతో రీప్లేస్ చేశారు. దీంతో ‘కాంతార’ సినిమాని ఒటీటీలో చూసిన వారికి థియేటర్ లో చూసిన ఫీలింగ్ రావట్లేదు. కాపీ రైట్స్ సమస్య తీరిపోయింది కానీ మేకర్స్ ఎందుకో ‘వరాహ రూపం’ సాంగ్ ని ఇంకా అమెజాన్ ప్రైమ్ లో పెట్టలేదు. ఒరిజినల్ సాంగ్ ని పెడితే ‘కాంతార’ వ్యూవర్షిప్ ఏమైనా పెరుగుతుందేమో కానీ ఇప్పటికైతే ‘కాంతార’ సినిమాని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు.
ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, లార్జ్ స్కేల్ మేకింగ్ తో థియేటర్ కోసం రూపొందించిన సినిమాలని థియేటర్స్ లోనే చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. కాంతార సినిమా 400 కోట్లు రాబట్టింది అంటే ఇందులో ఎంతమంది రిపీట్ ఆడియన్స్ ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. థియేటర్ లో కనిపించిన ఈ గ్రాండ్ విజువల్, ఇంట్లో కూర్చోని టీవీలో చూస్తున్నప్పుడు చాలా మాములుగా అనిపించొచ్చు, అంత ఇంపాక్ట్ ఇవ్వకపోవచ్చు. పైగా థియేటర్ లో సినిమా చూడడానికి ఇంట్లో కూర్చోని సినిమా చూడడానికి చాలా తేడా ఉంది. థియేటర్ అనేది ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తుంది, ఆ మూడ్ లోకి తీసుకోని వెళ్తుంది. ఇంట్లో ఆ మూడ్ ని సెట్ చేసే వాతావరణం ఉండదు. అందుకే లార్జ్ స్కేల్ సినిమాలు ఒటీటీలో అంతగా ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నాయి. పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, KGF 2 సినిమాలే అందుకు ఉదాహరణ. అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒటీటీలోకి వచ్చాకే ఇంకా ఎక్కువ పేరొచ్చింది కదా అనుకోవచ్చు కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఒటీటీలో రిలీజ్ అయ్యాకా వెస్ట్ కంట్రీస్ లో పేరొచ్చింది కానీ ఇండియాలో కాదు. ఇండియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి మిశ్రమ స్పందనే వచ్చింది.