Kannappa Trailer Review : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. 2.54 నిముషాల నిడివి ఉన్న ట్రైలర్ లో కీలక పాత్రలు అన్నీ చూపించేశారు. ట్రైలర్ లో సింహభాగం మంచు విష్ణు పాత్రనే కనిపించింది. ట్రైలర్ నిండా రిచ్ లుక్ కనిపిస్తోంది. గూడెంలో ఉండే వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు.. తిన్నడి పాత్రలో ఉండే మంచు విష్ణు చేసిన పోరాటాలు మొదటగా చూపించారు. తిన్నడి గెటప్ లో విష్ణు లుక్ బాగానే ఉంది. బాణాలు వేస్తూ చేసే యాక్షన్ సీన్ల మేకింగ్ ఆకట్టుకుంటోంది. గత సినిమాలతో పోలిస్తే ఇందులో విష్ణు డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్లు కొత్తగా అనిపించాయి.
Read Also : Kannappa Trailer : కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది..
‘వినపడని వాడికి విన్నపాలెందుకు.. వీళ్లకు ఈ దండాలెందుకు’ అంటూ విష్ణు చెప్పిన డైలాగ్ దేవుడిపై తిన్నడి అభిప్రాయాన్ని చూపిస్తోంది. ఇందులోని నటీనటుల గెటప్ ఒకే విధంగా కనిపిస్తున్నాయి. దేవుడు లేడు అంటూ ఉండే తిన్నడుని శివ భక్తుడిగా మార్చేందుకు రుద్రుడి పాత్రలో ప్రభాస్ ను ప్రవేశ పెట్టినట్టు కనిపిస్తోంది. రుద్రుడి పాత్రలో ప్రభాస్ గెటప్ అదిరిపోయింది. ఇందులో ప్రభాస్ చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడు. ‘పెద్దోళ్లందరి కంటే నేనే పెద్దోన్ని’.. ‘నువ్వు, నీ దేవుడు తోడుదొంగలే’.. ‘శివయ్యా అని మనసారా పిలువు’ అనే డైలాగ్స్ ప్రభాస్ నుంచి వినిపించాయి. ప్రభాస్ పాత్ర వరకు చాలా హుందాతనం కనిపిస్తోంది. డైలాగ్స్, గెటప్ కట్టిపడేసేలా ఉన్నాయి.
అటు శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతి పాత్రలో కాజల్ మెరిశారు. తిన్నడి మనస్తత్వాన్ని మార్చేందుకు శివపార్వతుల మధ్య వచ్చే సంభాషణలు కొంత వరకు ఇందులో చూపించారు. ఇరువురు పాత్రల వరకు బాగానే మెప్పించారు. మోహన్ లాల్ పాత్ర ఇందులో ఇంకాస్త పవర్ ఫుల్ గా ఉంటే బాగుండేదనిపిస్తోంది. మరి ట్రైలర్ లో చూపించినట్టే సినిమాలో ఆయన పాత్ర ఉంటుందా.. లేదంటే ఇంకా ఫైర్ ఉంటుందా అనేది చూడాలి.
శివుడికి పరమ భక్తుడిగా మోహన్ బాబు పాత్రలో ఒదిగిపోయారు. ‘వాయులింగం రహస్యాలను నేను కాపాడతాను’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ ను బట్టి చూస్తే.. ఆయన పాత్ర సినిమాలో కీలకం అని తెలుస్తోంది. మంచు విష్ణు గత సినిమాలతో పోలిస్తే ఇందులో నటన పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాకపోతే కొన్ని చోట్ల సెట్స్ నమ్మశక్యంగా అనిపించట్లేదు. లొకేషన్, సెట్స్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. మొత్తంగా ట్రైలర్ చూస్తే.. గత టీజర్ కంటే బెటర్ గా ఉంది. చూస్తుంటే అంచనాలు పెంచేలాగానే కనిపిస్తోంది.
Read Also : Rahul Ramakrishnan : డైరెక్టర్ గా మారుతున్న మరో స్టార్ కమెడియన్