కన్నడ చిత్రసీమలో నటసార్వభౌముడుగా జేజేలు అందుకున్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. ఆయన చిన్న కొడుకు పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం కన్నడ చిత్రసీమలో ‘పవర్ స్టార్’గా జేజేలు అందుకుంటున్నారు. కేవలం 46 ఏళ్ళ వయసున్న పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ ప్రజలను, అక్కడి చిత్రసీమను శోక సముద్రంలో ముంచేసింది. కన్నడ చిత్రసీమలో ఏకైక సూపర్ స్టార్ గా నిలచిన రాజ్ కుమార్ కుటుంబం అంటే కన్నడ జనానికి ఎనలేని గౌరవం. రాజ్ కుమార్ కన్నుమూసిన సమయంలో కన్నడిగులు తమ సొంత మనిషిని కోల్పోయినట్టు ఎంతగా తల్లడిల్లారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు పునీత్ హఠాన్మరణం సైతం అక్కడి జనాన్ని విలవిలలాడేలా చేసింది. బాలనటునిగానే భళా అనిపించిన పునీత్ రాజ్ కుమార్, తొలి నుంచీ తనదైన బాణీ పలికిస్తూ అన్నలు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ కంటే భిన్నంగా సాగుతున్నారు. యువతలో పునీత్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక మాస్ లో శివ రాజ్ కుమార్ కు ఎనలేని ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాజ్ కుమార్ తనయుల్లో ఈ ఇద్దరూ స్టార్ హీరోస్ గా సాగుతున్నారు. అన్న శివరాజ్ కుమార్ నటించిన ‘జై బజరంగీ’ సినిమా విడుదలైన రోజునే పునీత్ రాజ్ కుమార్ కన్నుమూయడం అభిమానులకు మరింత ఆవేదన కలిగిస్తోంది. పునీత్ మరణవార్త తెలుగు చిత్రసీమలోని ఎందరినో కలచివేసింది. మన స్టార్ హీరోస్ తో కన్నడ రాజ్ కుమార్ కుటుంబానికి తొలి నుంచీ సత్సంబంధాలు ఉన్నాయి. అదే తీరున ఈ తరం తెలుగు హీరోలతోనూ రాజ్ కుమార్ తనయులు ఎంతో సఖ్యతతో మెలిగేవారు. అందువల్ల పునీత్ రాజ్ కుమార్ మృతి చెందారని తెలియగానే ఎంతోమంది జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు.
తెలుగుతో ‘రాజ్’ అనుబంధం…
తెలుగు చిత్రసీమకు, కన్నడ సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరంభంలో అనేక మంది తెలుగువారు కన్నడ చిత్రాలలోనూ నటులుగా, సాంకేతిక నిపుణులుగా పనిచేసి ఆకట్టుకున్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు కూడా తెలుగు సినిమా రంగంతో అనుబంధం ఉంది. ఆయన తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘బేడర కన్నప్ప’. ఆ సినిమాను తెలుగులో ‘కాళహస్తీ మహాత్మ్యం’గా తెరకెక్కించగా అందులోనూ రాజ్ కుమార్ భక్త కన్నప్పగా నటించి ఆకట్టుకున్నారు. ఆ తరువాత కూడా రాజ్ కుమార్ నటించిన అనేక కన్నడ సినిమాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ఇక తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలు కన్నడలో రాజ్ కుమార్ తోనే రీమేక్ అయి అక్కడి జనాన్ని ఆకట్టుకున్నాయి. యన్టీఆర్, ఏయన్నార్ ను తన అన్నలుగా భావించేవారు రాజ్ కుమార్. ఇక బెంగళూరులో షూటింగ్ కు వెళ్ళినపుడు ఎంతోమంది తెలుగు నటీనటులు రాజ్ కుమార్ ను కలుసుకుంటూ ఉండేవారు. ఇక మన సింగీతం శ్రీనివాసరావు అయితే రాజ్ కుమార్ తో అనేక చిత్రాలు రూపొందించి అలరించారు. మన తెలుగువారయిన మధురగాయకుడు పి.బి.శ్రీనివాస్ గానంతో రాజ్ కుమార్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. అలాగే రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్ కుమార్ సైతం తెలుగు సినిమావారితో ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తన భర్త హీరోగా నటించిన అనేక చిత్రాలకు పార్వతమ్మ నిర్మాతగా వ్యవహరించారు. ఆమె నిర్మాతగా తెరకెక్కిన ‘శంకర్ గురు’ కన్నడ నాట ఘనవిజయం సాధించింది. అదే కథతో తెలుగులో ‘కుమార రాజా’ రూపొంది ఇక్కడి వారిని అలరించింది. ఇదే సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ త్రిపాత్రాభినయంతో ‘మహాన్’గా రూపొందింది. పార్వతమ్మ నిర్మించిన పలు చిత్రాలు తెలుగులో మన హీరోలు రీమేక్ చేశారు. అలాగే తనయులు కథానాయకులుగానూ ఆమె అనేక సినిమాలు తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా పార్వతమ్మ నిర్మించిన ‘అప్పు’ చిత్రంతోనే పునీత్ హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా అప్పట్లో కన్నడ నాట బిగ్ హిట్. అదే తెలుగులో ‘ఇడియట్’గా రూపొంది ఇక్కడా అలరించింది. ఇక రాజ్ కుమార్ పెద్ద కొడుకు శివరాజ్ కుమార్, బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఓ పాటలో ప్రత్యేకంగా కనిపించి ఆకట్టుకున్నారు.
భళారే… లోహిత్…
పునీత్ రాజ్ కుమార్ అసలు పేరు లోహితాస్య. 1975 మార్చి 17న లోహిత్ రాజ్ కుమార్ మద్రాసులో జన్మించారు. రాజ్ కుమార్ ఐదుగురు సంతానంలో లోహిత్ అందరికంటే చిన్నవాడు. అతను పుట్టిన తరువాతే రాజ్ కుమార్ కన్నడనాట చిత్రపరిశ్రమ అభివృద్ధికై తన నివాసాన్ని బెంగళూరుకు మార్చారు. ఆ తరువాతే ఇతర కన్నడ తారలు కర్ణాటక రాజధాని చేరుకున్నారు. లోహిత్ ఐదేళ్ళ వయసులోనే తండ్రి నటించిన ‘వసంతగీత’ చిత్రంలో బాలనటునిగా నటించి మెప్పించారు. ఆ తరువాత తండ్రి హీరోగా రూపొందిన “భాగ్యవంత, చెలుసువే మోడగల్, ఎరడు నక్షత్రగలు, భక్త ప్రహ్లాద, యారివను, బెట్టద హూవు” వంటి చిత్రాలలో బాలనటునిగా నటించి ఆకట్టుకున్నారు. ‘భాగ్యవంత’ చిత్రంలో ప్రధాన కథ లోహిత్ చుట్టూ తిరుగుతుంది. ఇందులోని “వారబంతమ్మా… గురువారబంతమ్మా…” పాట రాఘవేంద్రస్వామి భక్తులకు అతిప్రీతిపాత్రమైనది. ఆ పాటలో రాజ్ కుమార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ పాటను మంత్రాలయంలోనే చిత్రీకరించారు. ఆ గీతంలో బాలనటునిగా లోహిత్ కనిపించారు. అలా తెలుగునాట లోహిత్ సినిమా చిత్రీకరణ సాగింది. పునీత్ నటించిన ‘బెట్టద హూవు’ సినిమా ద్వారా ఉత్తమ బాలనటునిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
తెలుగు రీమేక్స్ తో స్టార్ డమ్!
ఇక లోహిత్ పేరు పునీత్ రాజ్ కుమార్ గా మార్చిన తరువాత హీరోగా 2002లో మన పూరి జగన్నాథ్ ‘అప్పు’తోనే ప్రారంభం కావడం విశేషం. తొలి చిత్రమే ఘనవిజయం సాధించడంతో పునీత్ పేరు కన్నడ నాట మారుమోగి పోయింది. అప్పటికే ఆయన అన్నలు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ హీరోలుగా కొన్ని చిత్రాలు తెరకెక్కి జనాన్ని అలరించాయి. రాఘవేంద్ర రాజ్ కుమార్ నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో అనువాదమయ్యాయి. అయితే శివ, పునీత్ స్టార్ హీరోస్ గా జయకేతనం ఎగురవేశారు. పునీత్ నటించిన ‘అభి’ మంచి విజయం సాధించింది. ఇదే చిత్రం తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా ‘అభిమన్యు’ పేరుతో రూపొందింది. తెలుగులో జూనియర్ యన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఆంధ్రావాలా’ చిత్రకథతోనే మన తెలుగు దర్శకుడు మెహర్ రమేశ్ డైరెక్షన్ లో పునీత్ తో ‘వీరకన్నడిగ’ రూపొంది మురిపించింది. తెలుగులో విజయం సాధించిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ ఆధారంగా కన్నడలో రూపొందిన ‘మౌర్య’లోనూ పునీత్ హీరోగా నటించి అలరించారు. జనార్దన్ మహర్షి రాసిన ‘ఆకాశ్’ లోనూ పునీత్ హీరోగా నటించారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ఒక్కడు’ ఆధారంగానే పునీత్ ‘అజయ్’ రూపొంది విజయం సాధించింది. తెలుగులో విజయం సాధించిన ‘రెడీ’ ఆధారంగా పునీత్ ‘రామ్’ రూపొంది ఆకట్టుకుంది. తన తండ్రి పేరుతో ‘రాజకుమార’ అనే చిత్రంలో పునీత్ నటించారు. ఆ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. ‘కేజీఎఫ్ 1’ వచ్చే దాకా కన్నడ బాక్సాఫీస్ లో టాప్ ప్లేస్ లో ‘రాజకుమార’ నిలచింది.
తండ్రి బాటలో…
రాజ్ కుమార్ నటునిగా కాకుండా, గాయకునిగానూ తనదైన బాణీ పలికించారు. ఆయనకు ఉత్తమ గాయకునిగా నేషనల్ అవార్డ్ కూడా లభించింది. తండ్రి బాటలోనే పయనిస్తూ పునీత్ రాజ్ కుమార్ సైతం తన చిత్రాల్లోని పాటలను తానే పాడుకొనేవారు. “మిలన, జాకీ” చిత్రాల ద్వారా ఉత్తమనటునిగా కర్ణాటక ప్రభుత్వ ఫిలిమ్ అవార్డులు అందుకున్నారు పునీత్. కన్నడ చిత్రసీమలో అత్యధిక పారితోషికం పుచ్చుకొనే అతి కొద్ది మందిలో పునీత్ రాజ్ కుమార్ ఒకరు. ఆయన బుల్లితెరపైనా తనదైన బాణీ పలికించారు. ‘కన్నడద కోట్యాధిపతి’ కార్యక్రమానికి పునీత్ ప్రెజెంటర్ గా ఆకట్టుకున్నారు.
వ్యక్తిగతం…
పునీత్ రాజ్ కుమార్, అశ్వనీ రేవంత్ ను 1999 డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరమ్మాయిలు. ధృతి, వందిత వారి పేర్లు. నందినీ మిల్క్, 7 అప్, మలబార్ గోల్డ్, పోతీ సిల్క్స్, ఫ్లిప్ కార్ట్, మనప్పురమ్ సంస్థలకు పునీత్ బ్రాండ్ అంబాసిడర్. కన్నడసీమకు చెందిన ఐపీఎల్ టీమ్ ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’కు కూడా పునీత్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే పునీత్ కు సొంతగా ‘బెంగళూరు 5’ అనే ప్రీమియర్ ఫ్యూట్సల్ టీమ్ కూడా ఉంది. యూ ట్యూబ్ లో ‘పీఆర్కే ఆడియో’ కూడా పునీత్ కు చెందినదే.
పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం అభిమానులకు తీరని ఆవేదన కలిగిస్తోంది. ఇప్పటికి దాదాపు 30 చిత్రాలలో పునీత్ హీరోగా నటించారు. ఆ సినిమాలే అభిమానుల ఆవేదనను తీర్చే ఔషధంగా పనిచేస్తాయని చెప్పవచ్చు.