మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరోలా మాట్లాడటం బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కు చేతకాదు. ఏ విషయం గురించైనా తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఆమె రకరకాల వివాదాలకు కేంద్ర బిందువు అవుతూ వస్తోంది. చిత్రం ఏమంటే కంగనా రనౌత్ మీడియా ముందుకు వస్తే చాలు… ఆమెను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి కాంట్రావర్సీ లోకి లాగడం ఉత్తరాది మీడియాకు అలవాటుగా మారింది. అలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హీరో షాహిద్ కపూర్ గురించి చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి తెర తీశాయి.
షాహిద్ కపూర్, కంగనా రనౌత్ కలిసి 2017లో ‘రంగూన్’ సినిమాలో నటించారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ సమయంలో కంగనాకు, షాహిద్ కు మధ్య కోల్డ్ వార్ జరిగిందనే వార్త అప్పట్లో విశేషంగా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆ సమయంలో కంగనా ఈ విషయమై నోరు మెదపలేదు కానీ షాహిద్ మాత్రం తమ మధ్య ఎలాంటి గొడవ లేదని ఖండించాడు. అయితే… ఇంతకాలం తర్వాత మరోసారి ఆ పాత విషయాన్ని మీడియా కంగనా దగ్గర తవ్వింది. ‘షాహిద్ తో ‘రంగూన్’ మూవీ సమయంలో గొడవలేమీ జరగలేదా?’ అంటూ ఆరా తీసింది. దాంతో అప్పటి రోజుల్ని కంగనా తలుచుకుంటూ, ‘షూటింగ్ జరిగిన మారుమూల ప్రాంతంలో ఎలాంటి వసతులూ లేవని, దాంతో తనకు, షాహిద్ కోసం టెంపరరీగా ఓ కాటేజీని నిర్మించారని, అయితే అందులో గడిపిన రోజులన్నీ తనకో పీడకలలా పరిణమించాయ’ని ఆరోపించింది. ప్రతి రోజూ ఉదయాన్నే షాహిద్ పెద్ద శబ్దం వచ్చేలా హిప్ హాప్ మ్యూజిక్ పెట్టేవాడని, ఓ పిచ్చోడి మాదిరి స్పీకర్ లో పాటలను పెట్టుకుని వింటూ ఎక్సర్ సైజ్ లు చేసేవాడ’ని కంగనా తెలిపింది. అతని బాధ భరించలేక చివరకు దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ఆ కాటేజీలోంచి తన టీమ్ తో బయటకు వచ్చానని చెప్పింది. ఇతరులు తన వల్ల ఇబ్బంది పడుతున్నారనే స్పృహ షాహిద్ కు లేదంటూ కంగనా వ్యాఖ్యానించింది. మరి ఈ విషయమైన ‘జెస్సీ’ హీరో షాహిద్ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి.