బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసినా సంచలనమే. రియల్ గానే కాకుండా రీల్ లోనూ ఆమె ప్రయోగాలకు పెట్టింది పేరు. నువ్వు ఇది చేయలేవు అని చెప్తే.. దాన్ని చేసి చూపించేస్తుంది. ఇక బయోపిక్ ల విషయంలో అయితే అమ్మడిని ఆపడం ఎవరి తరం కాదు. మణికర్ణిక, తలైవి చిత్రాలలో కంగనా నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఇక తాజాగా కంగనా మరో బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, దర్శకత్వం కంగనానే అందివ్వడం విశేషం.
1975 లో జరిగిన యదార్ధ ఘటన గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందిరా గాంధీగా కంగనా మక్కీకి మక్కి దింపేసింది. ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా ఆమె లుక్ ఆకట్టుకొంటున్నాయి. హెయిర్ దగ్గర నుంచి హావభావాలు, వాయిస్ వరకు అన్నింటిని ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక చివర్లో ఇందిరాను అందరు మేడమ్ అని కాదు సర్ అని పిలుస్తారని అమెరికా అధ్యక్షుడు కి తెలుసా..? అని కంగనా చెప్పిన డైలాగ్ ఇందిరా గాంధీ ఎంతటి పవర్ ఫుల్ లేడీనో తెలిసేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్..శ్రేయాస్ తల్పాడే..భూమికా ఛావ్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.