పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గురువారం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ‘ఆప్’ జాతీయ పార్టీ హోదాను పొందే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. “ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు… పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రమైన పంజాబ్‌లో విజయం సాధించడం అభినందనీయం” అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
Read also : Pawan Kalyan : ‘ఏజెంట్’ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా ?
కాగా ప్రస్తుతం ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలను జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తోంది. లోక్‌సభ లేదా రాష్ట్ర ఎన్నికల సమయంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం ఓట్ల వాటాలో కనీసం 6% సాధించిన రాజకీయ పార్టీ… జాతీయ పార్టీ హోదాను పొందుతుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ 54% ఓట్లను సాధించింది. 2022 అసెంబ్లీ ఎన్నికలలో AAP పంజాబ్‌లో 42%, గోవాలో 6.77%, ఉత్తరాఖండ్‌లో 3.4%, ఉత్తరప్రదేశ్‌లో 0.3% ఓట్ల వాటాను నమోదు చేసింది. 6% ఓట్ల వాటాతో పాటు, ఒక పార్టీ లేదా ఏదైనా రాష్ట్రం నుండి పార్లమెంటులో కనీసం నాలుగు స్థానాలను గెలుచుకోవాలి. ప్రస్తుతం ఆప్‌కి లోక్‌సభలో కేవలం ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు. కనీసం మూడు వేర్వేరు రాష్ట్రాల నుండి ఎన్నికైన సభ్యులతో లోక్‌సభలో 2% సీట్లు గెలిచినా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకుంటుంది. డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ అక్కడ కూడా గెలిస్తే AAPకి జాతీయ పార్టీ హోదాను దక్కించుకునే అవకాశం ఉంది.
Congratulations to my friend @ArvindKejriwal and Aam Aadmi party for their sweeping victory. It is commendable that within ten years since it's inception, the party has reigned victorious in another state, Punjab. pic.twitter.com/NGSXyrOLIj
— Kamal Haasan (@ikamalhaasan) March 11, 2022