Kaikala Satyanarayana Chalapathi Rao Journey With Sr NTR: ఈ యేడాది మే 28వ తేదీన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు శతజయంతి ఉత్సవం ఆరంభమైంది. మరో ఐదు నెల్లలో అంటే వచ్చే యేడాది మే 28న యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. చిత్రమేంటో కానీ, యన్టీఆర్ సినిమాల ద్వారా జనం మదిలో చోటు సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ, తమ్మారెడ్డి చలపతిరావు – రామారావు శతజయంతి ఉత్సవాలను చూసేందుకే ఉన్నారని అందరూ భావించారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు నటులు వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కానీ, డిసెంబర్ 23 తెల్లవారు జామున ఒకరు, డిసెంబర్ 24 రాత్రి మరొకరు కన్నుమూశారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఎంతో అభిమానంగా ‘అన్న’ అని పిలుచుకున్న రామారావుతో వారి అనుబంధాన్ని మననం చేసుకుందాం.
సత్యనారాయణ, చలపతిరావు ఇద్దరూ యన్టీఆర్ సినిమాలతోనే నటులుగా వెలుగు చూశారు. సత్యనారాయణ ‘సిపాయి కూతురు’లో నాయకునిగానే పరిచయం అయినప్పటికీ ఆ సినిమా పరాజయం పాలు కావడంతో, తరువాత యన్టీఆర్ కు ‘బాడీ డబుల్’గా నటిస్తూ సాగారు. రామారావు సొంత చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’తోనే నటునిగా మార్కులు సంపాదించారు. ఆ తరువాత యన్టీఆర్ ‘శ్రీకృష్ణావతారం’లో యస్వీఆర్ పోషించవలసిన దుర్యోధన పాత్రను ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో సత్యనారాయణతో ఆ పాత్రను ధరింప చేసి, నటునిగా అతనికి మరింత గుర్తింపు వచ్చేలా చేశారు రామారావు. ఇక చలపతిరావు అంతకు ముందు కొన్ని సినిమాల్లో ‘సెట్ ప్రాపర్టీ’లాంటి వేషాలు వేసినా, ఆయన డైలాగ్ చెప్పి తెరపై కనిపించిన తొలి చిత్రం యన్టీఆర్ ‘కథానాయకుడు’ అనే చెప్పాలి.
ఈ ఇద్దరు నటులు యన్టీఆర్ దర్శకత్వంలో నటించి, మెప్పించారు. ఇద్దరూ రామారావు డైరెక్షన్ లో బహుపాత్రలు ధరించడం మరో విశేషం! యన్టీఆర్ నటించి, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన “దానవీరశూర కర్ణ, చాణక్య-చంద్రగుప్త, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీరామపట్టాభిషేకం, బ్రహ్మంగారి చరిత్ర, చండశాసనుడు” వంటి చిత్రాల్లో ఈ ఇద్దరూ నటించారు. ‘దానవీరశూర కర్ణ’లో యన్టీఆర్ త్రిపాత్రాభినయం ధరిస్తే చలపతిరావుతో ఏకంగా సూతుడు, ఇంద్రుడు, బ్రాహ్మణుడు, జరాసంధుడు వంటి పాత్రలు పోషింప చేశారు. ఇక యన్టీఆర్ పంచపాత్రలు పోషించిన ‘శ్రీమద్విరాటపర్వము’లో సత్యనారాయణతో భీమ, ఘటోత్కచ పాత్రలు ధరింప చేశారు.
యన్టీఆర్ కు ఈ ఇద్దరు నటులు తండ్రి, కొడుకు పాత్రల్లోనూ నటించడం విశేషం! యన్టీఆర్ తో నూటికిపైగా చిత్రాల్లో నటించిన సత్యనారాయణ ఆయనకు కొడుకుగా ‘పాండవవనవాసము’లో నటించారు. అందులో యన్టీఆర్ భీమునిగా, సత్యనారాయణ ఘటోత్కచునిగా అభినయించారు. ఆ తరువాత “మనుషులంతా ఒక్కటే, బొబ్బిలిపులి, సత్యం-శివం” వంటి చిత్రాలలో రామారావుకు తండ్రి పాత్రలో కనిపించి అలరించారు సత్యనారాయణ. ఇక చలపతిరావు విషయానికి వస్తే, ‘దానవీరశూర కర్ణ’లో యన్టీఆర్ కర్ణునిగా నటించగా, ఆయన తండ్రి సూతునిగా చలపతిరావు కనిపించారు. ‘శ్రీరామపట్టాభిషేకం’లో యన్టీఆర్ రావణబ్రహ్మగా అభినయించగా, ఆయన కొడుకు ఇంద్రజిత్ గా చలపతిరావు నటించారు.
యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసే సమయానికి సత్యనారాయణ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. అలాగే చలపతిరావు అప్పుడప్పుడే మంచి పాత్రలు అందిపుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 1982లో యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీకి వారిద్దరూ ప్రత్యక్షంగా సేవలు అందించలేక పోయినా, తరువాతి రోజుల్లో ఇద్దరూ పార్టీ తరపున ప్రచారం చేసినవారే! యన్టీఆర్ మరణించాక సత్యనారాయణ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించి, ఎమ్.పి.గా ఉన్నారు.
నందమూరి నటవంశంలో టాప్ స్టార్స్ గా వెలిగిన యన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ యన్టీఆర్ చిత్రాలలో సత్యనారాయణ, చలపతిరావు కీలక పాత్రలు పోషించి మెప్పించారు. అంతేకాదు యన్టీఆర్ తో సత్యనారాయణ సమర్పకునిగా ‘గజదొంగ’ సినిమా నిర్మించగా, రామారావు నటవారసుడు బాలకృష్ణ ‘కలియుగకృష్ణుడు’ చిత్రానికి చలపతిరావు స్లీపింగ్ పార్ట్ నర్ గా వ్యవహరించారు. ఎటు చూసినా యన్టీఆర్ తోనూ, ఆయన కుటుంబ సభ్యులతోనూ సత్యనారాయణ, చలపతిరావు ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. అంతేకాదు, ఈ ఇద్దరినీ యన్టీఆర్ తనయులు ‘బాబాయ్’ అంటూ అభిమానంగా పిలిచేవారు. ఒకే సమయంలో సత్యనారాయణ, చలపతిరావు కన్నుమూయడంతో యన్టీఆర్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని వారే దూరమైనట్టుగా ఆవేదన చెందుతున్నారు.