మలయాళీ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృధ్వీరాజ్ నటించిన తాజా చిత్రం ‘కుడువా’! సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ తెరకెక్కించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ పిరియడ్ యాక్షన్ మూవీలో ‘భీమ్లా నాయక్’తో తెలుగువారి ముందుకొచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబెరాయ్ కీలక పాత్ర పోషించాడు.
ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేయడానికి తొలుత సన్నాహాలు చేసి, ప్రచారపర్వాన్ని ప్రారంభించింది చిత్ర బృందం. అయితే జాతీయ స్థాయిలో ఒకే రోజున వివిధ భాషల్లో విడుదల చేయాలనే సరికీ సమయం సరిపోదని భావించినట్టుంది. దాంతో ఓ వారం వెనక్కి తగ్గింది ‘కుడువా’! ఈ వారం రోజుల్లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి, పకడ్బందీగా జనం ముందుకు జూలై 7న రానుంది.