ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ ముఖ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియో కొన్ని గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్ రాబట్టడం విశేషం. 3 నిమిషాల వీడియోలో తన పరిస్థితిని సవివరంగా తెలియచేశాడు జస్టిన్.
ఈ వ్యాధి కారణంగా గ్రామీ విజేత ముఖం కుడి వైపు పక్షవాతానికి గురయింది. జస్టిన్ తన వీడియోలో పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో చూపించాడు. అంతే కాదు ‘నాకు రామ్‌సే హంట్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది. దీపి వల్ల కళ్ళలో ఒకదానిని రెప్పవేయలేను. నా ముఖంలో ఓవైపు నవ్వలేను. ఓ ముక్కు రంధ్రం కదలదు. సో ఓ వైపు పూర్తి పక్షవాతం ఉంది’ అని తెలియచేశాడు. ఇది చాలా తీవ్రమైనదిగా మీరు చూడగలరు. నా వేగాన్ని తగ్గించుకోవాలని శరీరం చెబుతోంది. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అందుకే సరైన విశ్రాంతి తీసుకుని నూటికి నూరు శాతం తిరిగి ఫిల్ అవటానికి కృషి చేస్తాను. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. నా ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫేషియల్ ఎక్సర్‌సైజులు కూడా చేస్తున్నా. దేవుడిని నమ్ముతాను. మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అని తన వీడియో తెలియచేశాడు కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్. ఇక ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.